అయ్యప్ప దీక్ష గురించి విన్నాం. భవానీ దీక్ష గురించి విన్నాం. కొత్తగా సేనాని దీక్ష ఏమిటనుకుంటున్నారా..? తూర్పు గోదావరి జిల్లా కడియంలో ఇప్పుడు ఇది న్యూ ట్రెండ్. వీరంతా దేవుళ్ల భక్తులు కారు. దేవుడి కోసం దీక్ష చేపట్టలేదు. వీరంతా జన సైనికులు.. పవన్ కళ్యాణ్ అభిమానులు. 9 మంది ప్రత్యేక డ్రెస్‌తో మాల ధరించి దీక్షలు చేపట్టారు. నిష్టగా ఉంటూ చెప్పులు కూడా వేసుకోకుండా ఊరూరా తిరుగుతున్నారు.
సేనాని దీక్ష, లక్ష్యం… జనసేన సిద్ధాంతాలని.. పార్టీ మ్యానిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లడం. అలాగే ఓటరు నమోదు.. సభ్యత్వ నమోదు చేయించడం. సేనాని దీక్ష మొత్తం 21 రోజులు పాటు ఉంటుందట. అంతేకాదు దేవుడి దీక్ష తరహాలోనే నిష్టగా ఉండి సర్వమత ప్రార్ధనలు చేస్తారు. అలాగే 21 రోజుల పాటు ఆలయాల దగ్గర బస చేస్తారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఎంతో పవిత్రంగా ఉన్నాయని.. అందుకే అంతే పవిత్రంగా ప్రచారం చేపట్టామని దీక్ష చేపట్టామని పవన్ కళ్యాణ్ అభిమానులు చెబుతున్నారు.
ఈ సందర్భంగా దీక్ష చేపట్టిన అభిమానులు మాట్లాడుతూ… మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఎంత పవిత్రంగా ఉంటాయో తెలిసిందే. అంతే పవిత్రంగా జనంలోకి తీసుకెళ్లాలని .. మేము కూడా అంతే నిష్టగా ఉండాలని మాల ధరించి ఈవిధంగా ప్రచారం చేస్తున్నాం. ప్రజల దగ్గరకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని.. జనసేన మ్యానిఫెస్టో గురించి తెలియచేస్తున్నాం. 21 రోజులు పూర్తైన తర్వాత పవన్ కళ్యాణ్ సమక్షంలో దీక్షను విరమిస్తాం అంటున్నారు. మొత్తానికి కడియంలో చేపట్టిన ఈ నయా దీక్ష విశేషంగా ఆకట్టుకుంటుంది..!