ప్రయాణికులకు మత్తుమందిచ్చి దోచుకున్నారు...

సోమవారం, 15 ఏప్రియల్ 2019 (09:54 IST)
యశ్వంత్‌పూర్ - హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతాల మధ్య నడిచే  సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో దోపిడీ జరిగింది. ప్రయాణికులకు మత్తుమందు ఇచ్చిన దుండగులు వారి వద్ద ఉన్న బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. 
 
వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట జీఆర్‌పీ ఎస్‌ఐ జితేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకకు చెందిన నితిన్‌జైన్, త్రిపురకు చెందిన రాహుల్, బిహార్‌కు చెందిన ప్రేమ్‌శంకర్, యూపీకి చెందిన బూరెఖాన్, కాన్పూర్‌కు చెందిన ఎండీ అబ్బాస్‌లు కర్ణాటకలో ప్రైవేట్‌ పనులు చేస్తున్నారు. ఆదివారం వారివారి స్వస్థలాలకు వెళ్లేందుకు యశ్వంత్‌పూర్‌ రైల్లో బయల్దేరారు. కోచ్‌లో ప్రయాణిస్తున్న కొందరు తోటి ప్రయాణికుల మాదిరిగా మాటలు కలిపి వారిని నమ్మించారు. 
 
ఈ క్రమంలో ధర్మవరం రైల్వేస్టేషన్‌ దాటిన తర్వాత కూల్‌ డ్రింక్స్, బిస్కెట్‌లో మత్తు పదార్థాలు కలిపి ఇవ్వగా ఆరుగురు వాటిని సేవించి స్పృహ తప్పారు. దీంతో వారి వద్ద ఉన్న డబ్బులు, సెల్‌ఫోన్లు, వాచీ, గోల్డు రింగులను దోచుకుని తర్వాత స్టేషన్‌లో దిగి పారిపోయారు. జీఆర్‌పీ పోలీసులు అప్రమత్తమై కాజీపేటకు రైలు రాగానే బాధితులు ఆరుగురుని దింపి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. స్పృహలోకి వచ్చిన వారు విషయం వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు