ఆ ఒక్కడిని తక్కువ అంచనా వేశా అంటూ నాలుక్కరుచుకున్న సోనియాగాంధీ
శనివారం, 11 జులై 2020 (18:58 IST)
వై.ఎస్.ఆర్.మరణం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారో తెలియని పరిస్థితి. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సీనియర్లనే పెట్టాలన్న ఆలోచన. కానీ వైఎస్ఆర్ కుమారుడు జగన్మోహన్ రెడ్డినే సీఎం చేయాలన్నది ఆ పార్టీలో కొంతమంది నేతల ఆలోచన. కానీ అధిష్టానానికి అది ఏ మాత్రం ఇష్టం లేదు.
దీంతో పార్టీలో ఎక్కువ రోజులు ఉండలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. సొంతంగా పార్టీనే పెట్టేసుకున్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలను తనవైపు తిప్పేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ తరువాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఇక ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు.
అందుకు ప్రధాన కారణం అతిపెద్ద తెలుగు రాష్ట్రాన్ని విడదీయడమే. ఇదంతా ఒక ఎత్తయితే సొంతంగా పార్టీ పెట్టిన జగన్మోహన్ రెడ్డి పార్టీని బలోపేతం చేస్తూ అంచెలంచెలుగా సీనియర్ నేతలను పార్టీలోకి తీసుకుంటూ అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. జగన్ పిల్లవాడు అతనికి రాజకీయాలు ఏం తెలుసు... అతను సిఎం అవ్వడం కలే అని స్వయంగా సోనియాగాంధీ తన పార్టీ నేతలతో చెప్పారు.
మనలాంటి యేళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో కొనసాగితేనే జగన్‌కు విలువ ఉంటుంది. లేకుంటే లేదంటూ చెప్పుకొచ్చారు సోనియాగాంధీ. ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు ఎపిలో సంవత్సరంలో వైసిపి పాలన బేష్ అంటూ కాంగ్రెస్ నేతలే నేరుగా చెప్పేస్తున్నారు. కన్నడ కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధారామయ్య జగన్మోహన్ రెడ్డిపై ప్రసంశల వర్షం కురిపించారు.
కరోనా సమయంలో జగన్ అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ఇలా మరికొంతమంది కాంగ్రెస్ నేతలే బహిరంగంగా జగన్‌ను పొగుడుతున్నారు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి కూడా ఈమధ్య జగన్ గురించి కొంతమంది పార్టీ సీనియర్లతో మాట్లాడి నాలుక కరుచుకున్నారట. ఒక్క వ్యక్తి ఏం చేయగలడు. అతని వల్ల ఏం సాధ్యమవుతుంది అనుకున్నాను. ఇలా ప్రభంజనం సృష్టిస్తాడని అస్సలు అనుకోలేదని సోనియాగాంధీ చెప్పారట.
ఇప్పుడు సోనియా జగన్‌ను పొగడటం కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం మింగుడు పడడం లేదు. యువ నాయకుడిగా రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్న జగన్మోహన్ రెడ్డిపై ఎవరైనా ప్రసంశలు కురిపించాల్సిందేనని వైసిపి నేతలు చెబుతుంటే ఎపిలో అభివృద్ధి శూన్యమంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైసిపిపై తీవ్రస్థాయిలో విమర్సలు చేస్తున్నారు.