కోవిడ్ నేపధ్యంలో సేఫ్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి: ఎన్నికల కమీషన్
మంగళవారం, 6 అక్టోబరు 2020 (08:13 IST)
ఎన్నికల పరిశీలకులు అంటే ఎన్నికల కమీషన్ కు కళ్లు,చెవులు వంటివారని కావున స్వేచ్ఛ శాంతియుత పారదర్శక విధానంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల పరిశీలకులు కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన ఎన్నికల కమీషనర్(సిఇసి)సునీల్ అరోర పేర్కొన్నారు.
బీహార్ అసెంబ్లీతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో వివిధ రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులతో పాటు ఎన్నికల పరిశీలకులుగా వెళుతున్న అధికారులతో (అబ్జర్వర్ల బ్రీపింగ్ సమావేశం) ఢిల్లీ నుండి ఆయన వర్సువల్ సమావేశం (వీడియో కాన్పరెన్స్) నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఇసి సునీల్ అరోర మాట్లాడుతూ కోవిడ్ నేపధ్యంలో గతంలో జరిగిన ఎన్నికలకు ఈసారి జరిగే ఎన్నికలకు తేడా ఉందని రానున్న ఎన్నికల నిర్వహణలో ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవశ్యకత ఉందని ముఖ్యంగా ఓటర్ల రక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు.
ఎన్నికల పరిశీలకులు(అబ్జర్వర్లు)అంటే ఎన్నికల కమీషన్‌కు కళ్లు, చెవులు వంటి వారని కావున ఎన్నికలు స్వేచ్ఛ శాంతియుతంగా పారదర్శకంగా జరిగేలా స్థానిక ఎన్నికల యంత్రాంగాలకు మార్గదర్శనం చేసి తోడ్బాటును అందించాలని సిఇసి సునీల్ అరోరా ఆదేశించారు.
ఎన్నికల్లో పెద్దఎత్తున ధనం,మద్యం పంపిణీ చేయడం ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించే వారిపై స్థానిక ఎన్నికల అధారిటీల సమన్వయంతో నిరంతర నిఘా ఉంచి అలాంటి ప్రయత్నాల నివారణలో ఎన్నికల పరిశీలకులు కీలకపాత్ర పోషించాలని చీఫ్ ఎలక్షన్ కమీషనర్ సునీల్ అరోర ఆదేశించారు.
అదే విధంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఖచ్చితంగా అమలు జరిగేలా చూడడంలో పరిశీలకులు కీలకపాత్ర పోషించాలని ఆయన స్పష్టం చేశారు.సి-విజిల్,1950 కాల్ సెంటర్ పై ఓటర్లలో విస్తృత అవగాహన కలిగించుటలో ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్నికల పరిశీలకులను సిఇసి సునీల్ అరోర ఆదేశించారు.
ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ఈసారి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు 80 ఏళ్లు నిండిన వారికి,అంగవైకల్యంతో ఇబ్బందిపడే వారికి అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. ఎన్నికలంటే ప్రతి ఒక్కరూ వాచ్ చేస్తారని కావున ఎన్నికల పరిశీలకు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
మరో ఎన్నికల కమీషనర్ సుశీల్ చంద్ర మాట్లాడుతూ కోవిడ్ నేపధ్యంలో సేఫ్ ఎలక్షన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఓటర్లలో అవగాహన పెంపొందిచుట ద్వారా పోలింగ్ శాతాన్ని పెంపొందించేందుకు పూర్తిగా కృషి చేయాలని చెప్పారు. అంతకు ముందు భారత ఎన్నికల కమీషన్ సెక్రటరీ జనరల్ ఉమేశ్ సిన్హా మాట్లాడుతూ స్వేచ్ఛ,శాంతి యుత ఎన్నికల నిర్వహణలో అబ్జర్వర్ల పాత్ర వారు వ్యవహరించాల్సిన తీరుపై వివరించారు.
అలాగే డిప్యూటీ ఎన్నికల కమీషనర్లు ధర్మేంద్ర శర్మ,సుదీప్ జైన్లు స్వీప్ యాక్టివిటీ,ఇవియంల నిర్వహణపై ప్రజెంటేషన్ ఇచ్చారు. అదే విధంగా డిప్యూటీ కమీషనర్లు చంద్రభూషణ్ కుమార్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఇతర లీగల్ ప్రావిజన్స్ అంశాలపై,ఆశిశ్ కుంద్రా ఐటి ఇనీషియేటివ్స్ పైన,సోషల్ మీడియా అంశాలపై శరత్‌చంద్ర వివరించారు.
వీడియో సమావేశంలో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సిఇఓ)కె విజయానంద్, బీహార్ ఎన్నికల పరిశీలకులుగా వెళుతున్న ముఖ్య కార్యదర్శులు ఆర్పి సిసోడియా, రామ్‌గోపాల్, కమీషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ పియూష్ కుమార్, 20మంది ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు.