ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి కోర్టు గండం పొంచివుంది. అక్రమాస్తుల కేసులకు ఆయన డుమ్మా కొడుతున్నారు. దీంతో హైదారాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈనెల 31వ తేదీన కోర్టుకు హాజరుకాకుంటే తగిన ఉత్తర్వులిస్తామంటూ హెచ్చరించింది. దీంతో జగన్మోహన్ రెడ్డి వచ్చే శుక్రవారం కోర్టుకు హాజరుకాని పక్షంలో ఆయన బెయిల్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు రద్దు చేసే అవకాశాలు లేకపోలేదు. అంటే.. జగన్‌కు కోర్టు గండం పొంచివుందని ఆయన తరపు న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారు.
ఈ అక్రమాస్తుల కేసులో జగన్ ఏ-1 నిందితుడు కాదా, వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఏ-2 నిందితుడుగా ఉన్నారు. కానీ, ఈ కేసు విచారణలో ఏ-1 నిందితుడుగా ఉన్న జగన్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని చేసిన అభ్యర్థనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.
పైగా, ఏ1 నిందితుడు అయిన జగన్‌కు ఎలాంటి మినహయింపులు ఇచ్చిన కేసు విచారణపై ప్రభావం చూపుతుందని, సాక్షులు ప్రభావితం అయ్యే అవకాశం ఉందన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకుని రావడంతో జగన్ వేసిన పిటీషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.
ఇదిలావుంటే, గత మూడువారాల వ్యవధిలో రెండు సార్లు కోర్టు ముందు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడటంతో జగన్ తరపు న్యాయవాద బృందం తర్జనభర్జనలు చెందుతోంది. ఏ1 నిందితుడు ఈనెల 31వ తేదీన కోర్టు ముందు హజరుకాకపోతే తగు ఆదేశాలు జారీ చేస్తామని ఉత్తర్వుల్లో న్యాయమూర్తి స్పష్టం చేయడంతో ఈ గండం గట్టెక్కడానికి ఏం చేయాలా ఆనే ఆలోచనలో జగన్ బృందం పడ్డట్లు తెలుస్తోంది.
ఈడీ కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలను హైకోర్టులో సవాలు చేయడమా? లేదా అనే విషయాన్ని కూడా వారు పరిశీలిస్తున్నట్లు సమాచారం. కోర్టు ఆదేశాలు పాటించకుండా వచ్చేవారం కూడా ఎదో కారణం చూపి హజరు మినహయింపు పిటీషన్ కనుక జగన్ తరపు న్యాయవాదులు చేస్తే... ఈడీ కేసులో తదుపరి చర్యలకు కోర్టు ఆదేశాలు జారీ చేయవచ్చనే సంకేతం స్పష్టంగా కన్పిస్తుండటంతో విచారణకు జగన్ హజరు అయ్యే అవకాశాలే కన్పిస్తున్నాయని న్యాయనిపుణులు అంటున్నారు.