ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాపై ఉత్కంఠత.. అరుణ్ జైట్లీ ఏం చేస్తారబ్బా?

శుక్రవారం, 29 జులై 2016 (11:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా అంశంపై ఇపుడు సర్వత్రా ఉత్కంఠత నెలకొనివుంది. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం రాజ్యసభలో ప్రత్యేకంగా ఓ ప్రకటన చేయనున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ జైట్లీ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రతిపాదించిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై గురువారం సుదీర్ఘ చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఏపీలోని అధికార, విపక్షాలకు చెందిన సభ్యులతో పాటు జాతీయ పార్టీలకు చెందిన పలువురు నేతలు కూడా కేవీపీ బిల్లుపై ప్రసంగించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని అన్ని పార్టీలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. 
 
ఈ క్రమంలో సభలో బీజేపీ ఒంటరి అయిపోయింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కూడా దీనిపై ప్రసంగించినా... బీజేపీకి ఏమాత్రం లాభం చేకూరకపోగా, విపక్ష నేతలు ఎదురు దాడికి దిగారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల సభ్యులు చేసిన డిమాండ్లపై ప్రభుత్వం తరపున శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ... రాజ్యసభ నాయకుడి హోదాలో సమాధానం చెప్పనున్నారు.

వెబ్దునియా పై చదవండి