అరకులోయ భూమ్మీద స్వర్గమే... కాదనం. కాని సెల్ఫీకోసం ప్రాణాలు తీసుకుంటామా?
సోమవారం, 17 జులై 2017 (01:04 IST)
అరకులోయ అంటే భూమ్మీద స్వర్గం.. గోవాకు వెళ్లకపోవచ్చు. ఊటీ, కోడైకెనాల్‌కు వెళ్ల లేకపోవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో పుట్టినవారు జీవితంలో ఒకసారైనా అరకులోయకు వెళ్లకుపోతే మన కళ్ల ముందు ఒక అపరూపమైన ప్రకృతి రమణీయతను నిజంగానే మిస్సవుతాం. విమానంలోంచి చూసే ఏరియల్ దృశ్యాన్ని మనం భూమ్మీదనుంచి మనకళ్లతోనే చూడాలంటే అది అరకులోయలోనే సాధ్యం కొన్ని కిలోమీటర్ల పొడవునా కొండల మధ్య పచ్చటి మైదానాన్ని మనముందు పరిచే ఒక విస్తృత విశాల దృశ్యాన్ని మనం అరకులోయలేనే చూడగలం.
ఒక మూడుగంటల పైగా అరణ్య నిసర్గ సౌందర్య రహస్యాన్ని విప్పి చెప్పే ఆ అద్భుత రైలు ప్రయాణాన్ని ఆస్వాదించాలంటే అరకులోయ రైలు ఎక్కాల్సిందే.. ఇప్పుడు వర్షం పడుతుంది, ఇప్పుడు పడదు అనిపించే నిత్య హరిత వర్షాన్ని చూడాలంటే అక్కడే సాధ్యం. భూమ్మీద అత్యంత స్వచ్చమైన జలాన్ని చూడాలంటే అద్దంలో కాకుండా నీళ్లలో మీ రూపాన్ని అత్యంత స్పష్టంగా చూసుకోవాలంటే అరకులోయ బొర్రా గుహల్లోనే సాధ్యం. ఘాట్ రోడ్ ఎక్కుతూ వాహనం దిగి అక్కడే రోడ్డు చప్టా మీద కూర్చుని మనం తెచ్చుకున్న భోజనం, టిఫిన్ తింటూ నిజమైన వనభోజన స్ఫూర్తిని పొందాలంటే అక్కడే సాధ్యం.
కానీ అరకులోయ వెళ్లాలనే ఆకాంక్ష దాన్ని చూడ్డానికే పరిమితమైతే బాగుండేది. కానీ అరకులోయ చూడాలని వెళుతూ ప్రయాణంలో సెల్పీ పిచ్చితో ప్రాణాలు పోగొట్టుకుంటే అరకులోయ ఏమనుకోవాలి? విషయమేమిటంటే అరకులోయ రైలులో సెల్ఫీ దిగాలనే సరదాతో ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గుంటూరుకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఆదివారం ఉదయం అరకులోయ అందాలు తిలకించేందుకు విశాఖ రైల్వే స్టేషన్‌లో విశాఖ–కిరండూల్ ప్యాసింజర్ రైలు ఎక్కారు. వీరిలో గుంటూరు మిలీనియం కళాశాలలో 4వ సంవత్సరం బి.ఫార్మసీ చదువుతున్న దేశిరెడ్డి గోపిరెడ్డి (21) అనే యువకుడు 8716 మైలురాయి బొండాం బ్రిడ్జి వద్ద రైలు తలుపు వద్ద వేలాడుతూ సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ట్రాక్ పక్కన ఉన్న విద్యుత్ స్తంభం తగిలి బ్రిడ్జి కింద పడిపోయాడు.
వంతెన అతిపెద్దది కావడంతో ఆ యువకుని తల నుజ్జునుజ్జయింది. రైలు నుండి వ్యక్తి జారిపడినట్లు గార్డు గమనించి రైలు ఆపాలని డ్రైవర్‌కు సమాచారం అందించాడు. ప్రాణాలతో ఉంటే ఆస్పత్రికి తరలించాలనే ఉద్దేశంతో స్ట్రక్చర్ పట్టుకొని వెళ్లి చూడగా అప్పటికే అతను మృతి చెందాడు. దీంతో విజయనగరం, అరకులోయ ఆర్‌పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు. అరకులోయ ఆర్‌ఫీఎఫ్ ఎస్.ఐ. సూర్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. విజయనగరం ఆర్‌పీఎఫ్ సిబ్బంది వచ్చిన తరువాత పంచనామా చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలిస్తారని ఆయన తెలిపారు.
ఆధునిక టెక్నాలజీ అందించిన అద్భుతమైన సాంకేతిక చిత్ర సాధనం సెల్ఫీ. కాదనలేం. కానీ భౌతిక సూత్రాల పరిమితిని అర్థం చేసుకోకుండా మనుషులు నిలువునా సెల్పీ పిచ్చితో రైలులోంచి తల బయటకు పెట్టి నిలువనా ప్రాణాలు తీసుకోవడం అవసరమా.. మన సాహసం, మన దూకుడు విరాట్ కోహ్లీలాగా పరువును, గోపిరెడ్డి లాగా ప్రాణాలను తీస్తుంటే ఇలాంటి సాహసాలు మనకు అవసరమా. మీరే ఆలోచించండి మరి.