ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ గ్యాస్‌ను పూర్తిగా తరలించినట్లు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ తెలిపారు. ఆయన శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. స్టైరిస్ గ్యాస్‌తో రెండో వెస్సెల్ వెళుతోందని, పరిశ్రమ చుట్టుపక్కల అయిదు కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
పరిశ్రమ చుట్టు ప్రక్కల గ్రామాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఆహారం, మంచి నీళ్ళు, పాలు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. అలాగే విశాఖలో 20 కెమికల్ పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించినట్లు కరికాల వలవన్ వెల్లడించారు.
ఇందుకోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టామన్నారు. ఇతర జిల్లాల్లో 35 పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టి, నివేదిక కూడా అందించారన్నారు. వాటికి సర్టిఫికెట్లు జారీ చేశాక మాత్రమే తిరిగి ప్రారంభించాలన్నారు. కాగా ఎల్‌జీ పాలిమర్స్‌లో జరిగిన దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే.
రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ చైర్మన్‌గా, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్‌కే మీనా సభ్యులుగా ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు అయింది.
అందుబాటులో హెల్ప్‌లైన్ నంబర్లు :
ఇక గ్యాస్ లీకేజీతో అస్వస్థతకు గురైన వారికి వైద్యం అందిచడానికి, ఇతర సహాయక చర్యలు చేపట్టేందుకు ఎల్జీ పాలీమర్స్ యాజమాన్యం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. గ్యాస్ ప్రభావంతో అస్వస్థతకు గురై ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి, ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చివవారికి అన్నవిధాలా సాయం అందించనున్నట్లు తెలిపింది.
బాధితులకు, వారిక కుటుంబాలకు వైద్యం,నిత్యావసర సరకులు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పని చేస్తామని ప్రకటించింది.
గ్రామస్తులు ఎలాంటి సమస్య వచ్చినా సంప్రదించేందుకు హెల్ప్‌లైన్ నంబర్లు : 0891-2520884, 0891-252338, వినతులు, వివాదులు, సమస్యలపై ఈమెయిల్ [email protected]కి పంపించవచ్చు.
విశాఖ కలెక్టర్ కు రూ.50 కోట్ల చెక్ అందించిన ఎల్జీ పాలిమర్స్
విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టైరీన్ విషవాయువు లీక్ కావడంతో 12 మంది మృతి చెందగా, వందల మంది ఆసుపత్రుల పాలవడం తెలిసిందే.
ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్ జీటీ) కూడా స్పందించింది. ముందుగా, రూ.50 కోట్లు జిల్లా కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయాలంటూ ఎల్జీ పాలిమర్స్ సంస్థ యాజమాన్యాన్ని ఆదేశించింది.
ఈ క్రమంలో సంస్థ ప్రతినిధులు విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కు రూ.50 కోట్ల చెక్ అందించారు. దీనిపై కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ, ఎన్ జీటీ ఆదేశాల మేరకు ఆ నిధిని వినియోగిస్తామని చెప్పారు.