అర్చకుల వేతనాలను పెంచడమే కాకుండా పెంచిన వేతనాలను చెల్లించేందుకు వీలుగా ఏపీ బడ్జెట్‌లో కేటాయింపులు జరపడం పట్ల విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్చకుల వేతనాల కోసం బడ్జెట్‌లో రూ. 120 కోట్ల కేటాయింపులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్వరూపానందేంద్ర స్వామీజీ ఓ ప్రకటన రూపంలో స్పందించారు.
'దశాబ్దాలుగా అర్చకుల వేతనాల కోసం పాలకులెవరూ పట్టించుకోలేదు. మ్యానిఫెస్టోలో ఉంచినా అర్చకుల వేతనాలను పెంచాలన్న ఆలోచనను నిర్లక్ష్యం చేశారు. జీతాలను పెంచడమే కాకుండా తదనుగుణంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించడం హర్షించదగిన విషయం. అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనీయుడు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న అర్చకులకు ప్రభుత్వ నిర్ణయం దోహదపడుతుందన్నారు.