సుధాకర్ రెడ్డి తలపై కొట్టిన ఇనుప రాడ్ ఎక్కడ? గాలిస్తున్న పోలీసులు

శుక్రవారం, 15 డిశెంబరు 2017 (15:41 IST)
కట్టుకున్న భర్తను కిరాతకంగా హతమార్చిన స్వాతి కేసుపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సుధాకర్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. మెహబూబ్ నగర్ నుంచి ప్రత్యేక టీమ్‌ను రప్పించి... రాజేష్ సమక్షంలోనే సుధాకర్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో కేసుకు సంబంధించి కీలక ఆధారాలను సేకరించారు.

సుధాకర్ రెడ్డి హత్య కేసులో హైదరాబాదులోని డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వాతి ప్రేమికుడు రాజేష్‌ను బుధవారం నాగర్ కర్నూల్ పోలీసులు ఆస్పత్రిలోనే అరెస్టు చేశారు. 
 
హైదరాబాదు నుంచి నాగర్‌కర్నూలుకు తీసుకొచ్చారు. డీఆర్‌డీవో ఆస్పత్రిలో రాజేష్‌ను డిశ్చార్జ్ చేయాలంటే రెండు లక్షల బిల్లు కట్టాల్సి వుంది. ఈ బిల్లు కట్టేందుకు రాజేష్ కుటుంబీకులు ముందుకు రాలేదు. ఇక లాభం లేదనుకున్న పోలీసులే ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరిపి రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముందుగా జిల్లా హెడ్ క్వార్టర్‌లో రాజేష్ వద్ద పోలీసులు సుదీర్ఘ విచారణ జరిపారు. 
 
స్వాతితో ఎప్పటి నుంచి పరిచయం, సుధాకర్ రెడ్డిని చంపేందుకు వాడిన మత్తు ఇంజక్షన్, తలపై కొట్టిన రాడ్ కోసం గాలిస్తున్నారు. పోలీసుల విచారణలో రాజేష్ కీలక విషయాలు తెలిపాడు. సుధాకర్ కుటుంబంలో తనకు ఎలాంటి శత్రుత్వం లేదని చెప్పాడు. స్వాతికి భర్తంటే ఇష్టం లేదని అందుకే తనతో కలిసి హత్యకు పాల్పడిందని చెప్పాడు. 
 
స్వాతి-రాజేష్ కలిసి వుండేందుకే సుధాకర్ రెడ్డిని పక్కా ప్లాన్ ప్రకారం చంపారని పోలీసులు చెప్తున్నారు. ప్లాస్టిక్ సర్జరీతో సుధాకర్ రెడ్డి స్థానంలో రాజేష్‌ను తీసుకొచ్చేందుకు స్వాతి స్కెచ్ వేసిందని పోలీసులు వెల్లడించారు. సుధాకర్ రెడ్డితో కుటుంబ సమస్యలతో పాటు రాజేష్‌తో సన్నిహిత సంబంధమే హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. 
 
విచారణ పూర్తయ్యాక ఛార్జీషీట్ విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన రాజేష్‌ను సుధాకర్ రెడ్డిని హతమార్చిన స్పాట్‌కు తీసుకెళ్లారు. నవాబ్ పేట మండలం, సత్యాపూర్ అడవుల్లో రాజేష్, స్వాతి వేసిన స్కెచ్‌ను పోలీసులు పరిశీలించారు. 
 
మృతదేహాన్ని తగులబెట్టిన విధానాన్ని కళ్లకు కట్టినట్లు పోలీసులకు చూపించాడు రాజేష్. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కీలక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సుధాకర్ రెడ్డి మృతదేహాన్ని తరలించిన బెంజ్‌ కారును పోలీసులు సీజ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు