వాస్తవానికి గురువారమే ఢిల్లీ వళ్లి రాజీనామా చేయాలని భావించి స్పీకర్ కార్యాలయానికి ఫోన్ చేయగా, స్పీకర్ సుమిత్రా మహాజన్ అందుబాటులో లేరని చెప్పారనీ, సోమవారం తర్వాత ఆమె ఢిల్లీలో అందుబాటులో ఉంటారని స్పీకర్ కార్యాలయం చెప్పిందని తెలిపారు. అందుకే మంగళ, బుధవారాల్లో ఢిల్లీకి వెళ్లి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు.
ఎంపీగా తాను ఫెయిల్ అయ్యానని తన మనస్సాక్షి చెబుతోందని అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలోని చాగల్లు రిజర్వాయర్‌కు నీరు కూడా తీసుకురాలేని తనకు ఎంపీ పదవి ఎందుకన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనందుకే రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చానని చెప్పారు.
అయితే, కేవలం ఎంపీ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని... టీడీపీకి కాదని జేసీ తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలోనే తాను భవిష్యత్తులో కూడా పని చేస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీనే అధికారంలోకి వస్తుందని తెలిపారు. కేవలం ప్రజాభిమానంతోనే తాను ఎంపీనయ్యానని... ఎవరి దయాదాక్షిణ్యాలతోనో కాదని జేసీ స్పష్టం చేశారు.