టీడీపీ వైపు వైకాపా ఎంపీ బుట్టా రేణుక చూపు?

ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (17:03 IST)
నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తర్వాత రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. టీడీపీ ఘన విజయం సాధించడంతో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు,  ఓ ఎంపీ టీడీపీ వైపు చూస్తున్నట్టు సమాచారం. ఆ ఎంపీ పేరు బుట్టా రేణుక. 
 
నిజానికి నంద్యాల ఉప ఎన్నిక ఫలితం అధికార పార్టీ టీడీపీలో జోష్‌ నింపింది. ప్రతిపక్షాన్ని డైలమాలో పడేసింది. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. వైసీపీతో పాటు కాంగ్రెస్‌ నుంచి కూడా టీడీపీలోకి తొంగి చూస్తున్నారు. ప్రధాన నాయకులతో టీడీపీ అధినాయకత్వం టచ్‌లో ఉన్నట్లు సమాచారం. 
 
ఇలాంటివారిలో ఎంపీ బుట్టా రేణుక ఒకరు. ఈమె పార్టీ మార్పుపై ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కోడుమూరుకు వచ్చిన ఆమెను ‘టీడీపీలో చేరుతున్నారా?’ అని విలేఖరులు ప్రశ్నించగా లేదని ఖరాకండిగా చెప్పకుండా ‘ఆ విషయం మా కుటుంబ సభ్యులతో చర్చించాలి. అలాంటిది ఉంటే ముందు మీకే చెబుతా. ఆ తర్వాతే పార్టీ మారుతా’ అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. దీంతో బుట్టా రేణుక టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారానికి బలం చేకూరుతోంది. 
 
ఇకపోతే, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డిని తమవైపు తిప్పుకోవడానికి అధికార, ప్రతిపక్ష నాయకులు మంతనాలు సాగించినట్లు సమాచారం. ఆయన ఏ నిర్ణయం స్పష్టంగా చెప్పలేదని తెలుస్తోంది. అయితే కోట్లను తమ పార్టీలో చేర్చుకోవడానికి టీడీపీ నేతలు మాత్రం కృషి చేస్తూనే ఉన్నారు. 
 
దీనికితోడు జిల్లాకు చెందిన ఇద్దరు ప్రతిపక్ష ఎమ్మెల్యేల సోదరుడితో హైదరాబాదులో టీడీపీ నాయకులు గురువారం రహస్యంగా భేటీ అయినట్లు తెలిసింది. తక్షణమే మంత్రి పదవి ఇవ్వాలని షరతు పెట్టడంతో చర్చలు విఫలమైనట్టు చర్చించుకుంటున్నారు. అయితే ఈ నెల 19న సీఎం చంద్రబాబు జిల్లాకు రానున్న నేపథ్యంలో కీలక రాజకీయ సమీకరణాలకు తెరలేచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు