ఎన్నికల్లో పోటీ చేయాల్సింది అధికారులు కాదని మంత్రులు అని, అందువల్ల మంత్రులు, ఎమ్మెల్యేలు డ్రైవింగ్ ఫోర్స్‌లా పని చేయాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ, అధికారులు నిబంధులు, సలహాలు ఇచ్చినప్పటికీ శాఖను నడిపించాల్సిందే మంత్రులేనని చెప్పారు. పని చేయని అధికారులను పిలిచి మాట్లాడో, మందలించో వారితో పని చేయించినపుడే మంత్రుల సామర్ధ్యం బయటపడుతుందని, పైగా, ఎన్నికల్లో పోటీ చేయాల్సింది మంత్రులేగానీ, అధికారులు కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.
15 ఏళ్లు తాను ముఖ్యమంత్రి గా పనిచేసినా.. గత 15 నెలల్లో వేగంగా సాధించినన్ని పెట్టుబడులు గతంలో రాలేదని సంతృప్తి వ్యక్తం చేశారు. పెట్టుబడులకు ఆమోదంతో పాటు సంస్థలు గ్రౌండ్ అయ్యేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. కేబినెట్‌లో ఏఏ సంస్థలకు ఆమోదం తెలుపుతున్నామో సంబంధిత శాఖ మంత్రి.. పనులు ప్రారంభం అయ్యేలా సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఎంతో కష్టపడి రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు తెస్తున్నప్పుడు రాజకీయంగాను వాటి ఫలాలు ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పాలని సీఎం సూచించారు.
గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల రాకతో విశాఖ ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతుందన్నారు. 2028 నాటికి విశాఖలో వేలాది ఐటీ ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రత్యేక నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. పశ్చిమలో ముంబై ఎలాంటి మహానగరమో.. తూర్పులో విశాఖ అంతటి మహానగరంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.