"పుర" పోరు ఫలితాలు చూసి నిరుత్సాహ చెందనక్కర్లేదు : చంద్రబాబు

ఆదివారం, 14 మార్చి 2021 (19:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నగర, పురపాలక, సంఘాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైకాపా విజయభేరీ మోగించింది. ఈ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న టీడీపీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ముఖ్యగా, విజయవాడ, విశాఖపట్టణం నగర పాలక సంస్థలను టీడీపీ కైవసం చేసుకుంటుందని భావించారు. కానీ, ఆ రెండు స్థానాల్లో కూడా ఫలితాలు తారుమారయ్యాయి.
 
ఈ ఫలితాపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రస్తుత ఫలితాలు చూసి నిరుత్సాహపడనక్కర్లేదని కార్యకర్తల్లో నిరాశ, నిస్పృహలు తొలగించే ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలని కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని ప్రశంసించారు. కొన్నిచోట్ల ప్రాణాలు పణంగా పెట్టి పార్టీకి అండగా నిలిచారని కొనియాడారు. 
 
అధికార దుర్వినియోగం, ప్రలోభాలు ఉన్నా గట్టిగా పోరాడామని వెల్లడించారు. ప్రజాసమస్యల పరిష్కారం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా సాగుదామని పిలుపునిచ్చారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తే రాబోయే రోజుల్లో విజయం మనదే అని చంద్రబాబు ఉద్ఘాటించారు.
 
కాగా, 75 మున్సిపాలిటీలకుగాను 73 స్థానాల్లో వైసీపీ విజయం అందుకున్నట్టు తెలుస్తోంది. చిలకలూరిపేట మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ కోర్టు ఆదేశాల మేరకు ఫలితాలు ప్రకటించలేదు. మున్సిపల్ కార్పొరేషన్లలోనూ వైసీపీనే నెగ్గింది. కోర్టు ఉత్తర్వులతో ఏలూరు కార్పొరేషన్ లో కౌంటింగ్ చేపట్టలేదు. ఇక మిగతా 11 కార్పొరేషన్లలో వైసీపీ హవానే సాగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు