ఏపీ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, వడపోతపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముమ్మర కసరత్తులు చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి 90 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు. వివిధ నియోజకవ ర్గాల్లో రాజకీయ పరిస్థితులు, ప్రతిపాదనలో ఉన్న అభ్యర్థుల బలాబలాలకు సంబంధించి తెప్పించుకున్న నాలుగైదు రకాల నివేదికలను ఆయన వడబోస్తున్నారు.
కేవలం ఒక నివేదికపై ఆధారపడకుండా రకరకాల మార్గాల ద్వారా సమాచారాన్ని ఆయన సేకరిస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న రాబిన్ శర్మ బృందం కొన్ని ప్రతిపాదనలు అందజేస్తోంది. నాలుగైదు జిల్లాలకు కలిపి నియమించిన జోనల్ సమన్వయకర్తలు కొంత సమాచారం ఇస్తున్నారు. ఇవిగాక పార్టీ సీనియర్ల నుంచి కొన్ని ప్రతిపాదనలు అందుతున్నాయి. వీటితోపాటు రెండు మూడు రకాల ప్రైవేటు సంస్థలను నియమించి వాటి ద్వారా కూడా సమాచార సేకరణ జరుపుతున్నారు.
మొత్తం 70-80 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై అధినాయకత్వం ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చింది. సామాజిక సమీకరణాలు, రాజకీయ బలాబలాలు, ప్రజల్లో వారిపై ఉన్న ఆదరాభిమానాలను మరోసారి బేరీజు వేసుకుని చూసుకుంటోంది. అధికార పార్టీ అభ్యర్థుల విషయంలో చేస్తున్న మార్పుచేర్పులను కూడా గమనిస్తోంది. ఉదాహరణకు.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట, వేమూరు నియోజకవర్గాల్లో మంత్రులు విడదల రజని, మేరుగ నాగార్జునలను గుంటూరు పశ్చిమ, సంతనూతలపాడుకు మార్చి- ఇక్కడ కొత్త అభ్యర్థులను వైసీపీ నిలుపుతోంది.
టీడీపీకి ఈ రెండు నియోజకవర్గాల్లో మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు ఇన్చార్జులుగా ఉన్నారు. వైసీపీ కొత్త అభ్యర్థులతో పోలిస్తే వీరిద్దరూ బలంగా ఉన్నారని టీడీపీ నాయకత్వం అభిప్రాయపడుతోంది. అలాగే, అన్ని నియోజకవర్గాలపై పరిశీలన జరుపుతోంది. అయితే అభ్యర్థులను వెంటనే ఖరారు చేయకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఐవీఆర్ఎస్ విధానం పేరిట ఫోన్ సర్వేలు చేసే పద్ధతి టీడీపీలో ఎప్పటి నుంచో అమల్లో ఉంది. ఈసారి కూడా ఇదే అమలు చేస్తోంది.