2019 ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా పనులు మొదలు పెట్టాయి. ఇందులో భాగంగా ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించి తమ పార్టీలోకి చేర్చుకోవడం చేస్తున్నాయి. పలువురు నేతలు గోడ మీద పిల్లుల్లా కాచుకుని జంప్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి పత్రికను వీధుల్లో, పార్కుల్లో ఉచితంగా పంచుతున్నారంటూ టీడీపీ మండిపడుతోంది.
ఈ క్రమంలో రూ.60లక్షల ఖర్చును జగన్ ఖాతాలో రాయాలంటూ.. ఎన్నికల సంఘాన్ని టీడీపీ కోరింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. సాక్షి పత్రికలో రిటైర్డ్ సీఎస్ అజయ్ కల్లంతో వ్యాసం రాయించి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారంటూ దివ్యవాణి ఆరోపించారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలంటూ సీఈసీని కోరారు.
ఇదిలా ఉంటే.. అనంతపురం జిల్లా టీడీపీలో టికెట్ల కేటాయింపులు చిచ్చు రేపుతున్నాయి. రాయదుర్గం ఎమ్మెల్యే టికెట్ ను మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కేటాయించారు. ఈ నేపథ్యంలో పార్టీకి రాజీనామా చేస్తామని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద్ రెడ్డిలు హెచ్చరించారు.