సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో సబితా ఇంద్రారెడ్డికి చోటు.. హరీష్‌ రావుకు కూడా...

గురువారం, 27 జూన్ 2019 (13:13 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఈ విస్తరణలో తన కుమారుడు కె. తారక రామారావుతో పాటు మేనల్లుడైన టి.హరీష్ రావులకు ఆయన మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారనే ప్రచారం సాగుతోంది. 
 
అలాగే, గత మంత్రివర్గంతో పాటు ప్రస్తుత మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. దీంతో కేసీఆర్‌పై అనేక రకాలై విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలకు ఈ దఫా తావులేకుండా ఉండేందుకు వీలుగా కేసీఆర్ ఓ మహిళను తన మంత్రివర్గంలోకి చోటు కల్పించవచ్చనే ఊహాగానాలు వినొస్తున్నాయి. ఈ మహిళ కూడా సబితా ఇంద్రారెడ్డి అంటూ ప్రచారం సాగుతోంది. ఈమె గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హోం మంత్రిగా పని చేయడమేకాకుండా, మాజీ ముఖ్యమంత్రులు కె.రోశయ్య, ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో పని చేశారు. దీంతో ఆమెకు మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారనే ప్రచారం సాగుతోంది.
 
అదేవిధంగా, మంత్రివర్గంలోకి తీసుకునే హరీష్ రావు, కేటీఆర్‌లకు కూడా కీలకమైన శాఖలను కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా కేటీఆర్‌కు గతంలో నిర్వహించిన ఐటీ, పంచాయతీ రాజ్ శాఖలను కేటాయించనున్నారట. అలాగే, హరీష్ రావుకు మాత్రం ఈ దఫా శాఖను మార్చనున్నారట. గతంలో భారీ నీటిపారుదల శాఖామంత్రిగా ఉన్న హరీష్ రావు.. ఈ దఫా విద్యాశాఖను కేటాయించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే, పలువురు మంత్రుల శాఖలను సీఎం కేసీఆర్ మార్చనున్నారనే ప్రచారం సాగుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు