తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 20 రోజులుగా యాదాద్రిభువనగిరి జిల్లాలో కలకలం రేపుతున్న కులాంతర వివాహం చేసుకున్న అంబోజు నరేష్(24), తుమ్మల స్వాతి(22) ప్రేమజంట వ్యవహారంలో నరేష్ అదృశ్యంపై మిస్టరీని పోలీసులు ఛేదించారు. తన కుమార్తె ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో నరేష్‌ను స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి పథకం ప్రకారం హత్యచేసినట్టు పోలీసులు నిర్ధారించారు. పల్లెర్ల గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో అంబోజు నరేష్‌ను శ్రీనివాస్ రెడ్డి ట్రాక్టర్ రాడ్‌తో కొట్టి చంపాడు. మృతదేహాన్ని పెట్రోల్‌పోసి కాల్చగా పూర్తిగా కాలకపోవడంతో పాత టైర్లతో పూర్తిగా దహనం చేసి.. ఎముకలు, బూడిదను ఆనవాళ్లు లేకుండా ఎత్తి మూటలు కట్టి మూసి నదిలో వేశాడు.
ఈ హత్య, మృతదేహాన్ని కాల్చడంలో తన సమీప బంధువు నల్ల సత్తిరెడ్డి అతడికి సహకరించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ హత్య కూడా తన వ్యవసాయ బావి వద్ద బండరాయిపై కూర్చున్న నరేష్‌ను శ్రీనివాస్ రెడ్డి తన చేతిలోని ట్రాక్టర్‌రాడ్‌తో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో ఆయనతో పాటు సమీప బంధువును నల్ల సత్తిరెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో దాగివున్న మిస్టరీ వీడిపోయింది.