జగన్‌కూ, పవన్ కల్యాణ్‌కు తేడా ఆ ఒక్క పాయింట్‌లోనే ఉందా?

శుక్రవారం, 31 మార్చి 2017 (03:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు రెండు విభిన్న దృక్పథాలు రేపటి భవిష్యత్తుకోసం హోరాహోరీగా ఘర్షిస్తున్నాయి. ఆ దృక్పథాలకు నామకరణం చేస్తే..ఒకరు వైఎస్ జగన్, మరొకరు పవన్ కల్యాణ్. ఒకరు ఏనుగు కుంభస్థలంపైనే దాడి చేయాలన్నట్లుగా ఇంటా బయటా ప్రభుత్వంపై ప్రతి చిన్నా, పెద్దా సమస్యలపై ఒంటికాలిమీద లేచి ఎదిరిస్తున్న దూకుడు మనిషి. మరొకరు ఎవరేమన్నా, మిన్నువిరిగి మీద పడుతున్నా చలించకుండా తానేం చేయాలనుకుంటున్నారా అదే చేస్తూ సామరస్యపూర్వకంగా ప్రజల సమస్యలకు పరిష్కారాన్ని చూపుతూ ప్రభుత్వానికి సానుకూల శత్రువుగా తయారౌతూ భవిష్యత్తుకు బాటలేసుకుంటున్న శాంతస్వరూపి.అయితే ఆశ్చర్యం ఏమిటంటే ప్రజలు ఏవైపు మొగ్గు చూపుతున్నారో ఇంకా తెలీదు కానీ ప్రభుత్వం ప్రతి  విషయం బద్‌నాం అయిపోతూ పరువు పోగొట్టుకుంటున్న పరిణామాల్లో చేష్ట్యలుడిగి కూర్చుంటున్న స్థితిలో మొత్తం రాజకీయాలను తమ చుట్టూ తిప్పుకుంటున్న శక్తులు వైఎస్ జగన్, పవన్ కల్యాణ్.
 
వైఎస్ జగన్ ఇప్పటికే రాజకీయంగా బయటపడిపోయారు. 2019లో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వ శక్తులూ ఒడ్డి అధికారం కైవసం చేసుకోవడం ఒకటే మార్గంగా తనదైన దూకుడు పంధాలో వెళుతున్నారు. ఈ మధ్య కాలంలో భారత రాజకీయాల్లో ప్రభుత్వంపై ఇంత ఘర్షణాత్మక వైఖరిని నిరంతరం కొనసాగిస్తూ తన ఉనికిి చాటుకుంటున్న వారు జగనే తప్ప మరొకరు లేరంటే తను ఏ స్థాయిలో చెలరేగిపోతున్నారో అర్థమవుతుంది. ప్రత్యర్థి బలాబలాలను మెరుపువేగంతో అంచనా వేసి చావుదెబ్బ కొట్టడంలో ఘనాపాఠీ అయిన చంద్రబాబు వంటి రాజకీయ దురంధరుడికే జగన్‌ని అడ్డుకోవడం, ఆయన సంధిస్తున్న విమర్శల శరపరంపరను తట్టుకోవడం ఎలాగో అర్థం కావడం లేదంటే ఆశ్చర్యపడనవసరం లేదు. 
 
ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానో, అనుద్దేశంగానో వేస్తున్న తప్పటడుగులు జగన్‌కు నిత్యం వరాలుగా మారుతున్నాయి. ప్రతి చిన్న విషయంలోనూ  అంత దూకుడు అవసరమా అనే ప్రశ్నను పట్టించుకోకుండా ప్రభుత్వ తప్పులను బండకేసి బాదడంలో దూకుడు వినా మరోమార్గం లేదని జగన్ గట్టి నిర్ణయానికి వచ్చారు. ఒక్కోసారి ఆ దూకుడు బూమెరాంగ్‌లాగా తన మెడకే  చుట్టుకుంటూ ఉండవచ్చు. కానీ కాలికి కత్తి కట్టిన కోడిలాగా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతున్న జగన్.. ప్రభుత్వ అసమర్థత, అవినీతి కారణంగా బలవుతున్న, దెబ్బతింటున్న ప్రజానీకానికి తిరుగులేని ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. 
 
సమస్య పట్ల వేగంగా స్పందించలేకపోతున్న చంద్రబాబు వయోభారం జగన్‌కు వరంలాగా మారింది. ముఖ్యమంత్రి స్పందించి ఘటనా స్థలికి చేరుకుని ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన చోట జగన్ మెరుపువేగంతో ప్రత్యక్షమవుతూ అధికారుల అలసత్వాన్ని నిలదీస్తూ, మీడియాలో నిత్యం సంచలనాలకు కారణమవుతున్నారు. తాత్కాలిక ప్రయోజనాలను పక్కన బెట్టి మరో రెండేళ్లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలనే దీర్ఘకాలిక వ్యూహంలో జగన్ దూకుడు మంత్రం వినా మరి దేన్నీ పాటించలేదు. 
 
అదే పవన్ విషయం.. పూర్తి భిన్నంగా ఉంది. ఇక తెలుగుదేశంతో, బీజేపీతో అంటకాగితే జనం నుంచి పూలు కాదు రాళ్లు పడతాయని చాలా త్వరగా గ్రహించేసిన పవన్ వచ్చే ఎన్నికల వరకు తాబేటి నడకను ఆదర్శంగా తీసుకుంటున్నారు. కానీ ఆ మందకొడితనం, నిదానం వెనుకే అసలైన వ్యూహం ఉందంటున్నారు రాజకీయ పండితులు. తాను పిలుపునిస్తే పొటెత్తి వచ్చే అశేష జనం దన్ను తప్ప పవన్ స్థాపించిన జనసేనకు ఇంతవరకు సంస్థాగత నిర్మాణం, బలం శూన్యం అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో సమస్యల పట్ల దూకుడుగా వ్యవహరించడం కంటే ఎక్కడ నొక్కితే సమస్య పరిష్కారమవుతుందో ఆ పాయింట్ మీదే నిలబడుతూ ప్రజల సమస్యలకు పరిష్కారాలు వెదకటం పవన్  వ్యూహం. 
 
ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా పవర్‌స్టార్‌గా జనసేనానిగా పవన్‌కు మాస్ ఇమేజ్ ఉంది. ఆయన రోడ్ల మీదికి వస్తే వేలాదిగా ప్రజలు ఆయన వెనుక వస్తారు. అయినా సరే.. ఈ దశలో పవన్ ఆచితూచి అడుగులేస్తున్నారు. ఆందోళనలు చేసి విధ్వంసాలకు దిగితే సమస్య పక్కదారి పడుతుందని దాని వల్ల బాధితులకు అన్యాయం జరుగుతుందనే కచ్చితమైన అవగాహనతో సహనంతో వ్యవహరిస్తూ సంయమనం పాటిస్తున్నారు. ప్రభుత్వాలపై విమర్శలకు దిగకుండానే పాలకుల్ని, అధికార యంత్రాంగాన్ని కదిలిస్తున్నారు. బాధితులతో మాట్లాడటం, గ్రామల్లో కలియతిరగటంలో జగన్, పవన్ వైఖరి ఒకటేగా ఉన్నా బాధిత ప్రజల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి దాన్ని పరిష్కరిస్తారా లేక తడాకా చూపమంటారా అంటూ ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టడంలో పవన్ పూర్తి భిన్న వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. రేపు ఎన్నికల సమయం దూసుకొచ్చేనాటికి పూర్తికాలం రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆర్థిక వనరుల కోసం తీప్రంగా ప్రయత్నిస్తున్న పవన్ నాలుగు రాళ్లు వేసి పక్కకు తప్పుకోవడం కాకుండా జనంకి భరోసా ఇవ్వడంలో తనదైన పంధాలో సాగుతున్నారు.
 
ఈ రెండు దృక్పథాలను బేరీజు వేసి చూస్తే వచ్చే ఎన్నికల్లో జగన్, పవన్‌ల వ్యూహమే ఏపీ భవితవ్యాన్ని  తేల్చి వేయనుందని స్పష్టమవుతుంది. జాతీయ స్థాయిలో వైఎస్ జగన్ మీడియానూ ఆకర్షిస్తుండగా, పవన్ రాష్టస్థాయిలో సొంత పునాదికోసం ఆచి తూచి అడుగులేస్తున్నారు. ఏపీ భవిష్యత్ రాజకీయ సమీకరణాలు ఈ ఇద్దరి చుట్టూనే తిరగనున్నాయని జనం అభిప్రాయం..
 

వెబ్దునియా పై చదవండి