మూడు రాజధానుల ఏర్పాటు చెత్త ప్రయోగం: చంద్రబాబు

మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (08:46 IST)
మూడు రాజధానుల ఏర్పాటు ప్రపంచంలో ఎక్కడా లేని చాలా చెత్త ప్రయోగమని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. 9 నెలలుగా రాష్ట్రం అంధకారంలో ఉందని ఆవేదన వ్యక్తంచేశారు.

కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే అన్ని రకాల పథకాలు, పనులు రద్దు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా చైతన్యయాత్రలో భాగంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు విశాఖపట్నం అత్యంత ఇష్టమైన నగరమని చెప్పారు. అక్కడ వైసీపీ భూభాగోతాన్ని బయటపెట్టేందుకు త్వరలో అక్కడకు వెళ్తున్నట్లు తెలిపారు.

ఇంటి పట్టాలిస్తామని పేదల నుంచి అసైన్డ్‌ భూములను లాగేసుకుంటున్నారని.. వారి పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. అమరావతిలో ఆందోళనలు కేవలం స్థానిక సమస్య కాదని.. రాష్ట్రానికి సంబంధించిన సమస్యని తేల్చిచెప్పారు.

‘అమరావతిలో రైతులు స్వచ్ఛందంగా 29 వేల ఎకరాల భూములను ఇచ్చారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని చెబుతున్న జగన్‌ అధికారంలోకి వచ్చి 9 నెలలవుతున్నా దాన్ని రుజువు చేయలేకపోయారు’ అని అన్నారు.

స్థానికంగా ఇటీవల మృతి చెందిన ఇద్దరు టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించారు. మంగళవారం కూడా కుప్పంలో పర్యటన కొనసాగనుంది.
 
టీడీపీ పాలనలో ఇచ్చిన స్కాలర్‌షి్‌పలు, హాస్టల్‌ ఫీజులు, కాస్మొటిక్‌ చార్జీలను కలిసి జగనన్న వసతి దీవెన అనే కొత్త పథకాన్ని జగన్‌ ప్రారంభించారని చంద్రబాబు విమర్శించారు. ‘వైసీపీ అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. ఇప్పటివరకు రద్దు చేయడాలే తప్ప ఒక్క అభివృద్ధి పనికీ శంకుస్థాపన జరగలేదు.

నేను రైతులకు రూ.50వేల రుణాలను ఒకేసారి మాఫీ చేస్తే.. మిగతా మొత్తాన్ని విడతలవారీగా చెల్లించా. మళ్లీ అధికారంలోకి వస్తే మిగిలిపోయిన 4, 5 విడతలను కూడా చెల్లిస్తా. అంతేగానీ రైతు భరోసాపేరిట మోసం చేయలేదు’ అన్నారు.

తన రాజకీయ జీవితంలో ఇలాంటి చెత్త సీఎంను ఎక్కడా చూడలేదన్నారు. ‘రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నాపై 26 రకాల విచారణలు జరిపించారు. ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు జగన్‌ గత ఐదేళ్ల టీడీపీ పాలనపై విచారణ కోసం పోలీసు అధికారులతో సిట్‌ ఏర్పాటు చేశారు. 
 
జగన్‌ అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. ఇప్పటివరకు ఏం చేశారు?’ అని ప్రశ్నించారు. ‘వైఎస్‌ వివేకానందరెడ్డిని ఎవరు చంపారో ప్రజలందరికీ తెలుసు. పోలీసులు కూడా తెలిసీ ఏం చేయలేకపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని జగన్‌ అన్నారు.

తానే అధికారంలోకి వచ్చి 9 నెలలైనా పురోగతి ఏదీ..? కోడి కత్తి అడ్రస్‌ ఇప్పటికీ తెలీదు. 9 నెలల నరకాసుర పాలనను మీరంతా వ్యతిరేకించాల్సిన సమయం వచ్చింది.

తమ్ముళ్లూ.. భయపడకండి. పోలీసులు ఇప్పుడు పెడుతున్న అక్రమ కేసులను సమీక్షించే రోజు వస్తుంది. చట్టాన్ని అతిక్రమిస్తే పోలీసులూ శిక్షార్హులే’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు