మానవ నాగరికతకు మూలం వేదాలని, మోక్షసాధన కోసం ఇవి మార్గదర్శకత్వం చేస్తాయని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి ఉద్ఘాటించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో జరిగిన వేదపారాయణానికి స్వామీజీ విచ్చేశారు.
ఏప్రిల్ 13 నుండి వేదపారాయణం జరుగుతోందని, కృష్ణయజుర్వేద పారాయణం పూర్తయిందని, ప్రస్తుతం జఠా పారాయణం జరుగుతోందని, అనంతరం ఘన పారాయణం నిర్వహిస్తారని చెప్పారు. ధర్మాచారణతో సుఖం, ఐశ్వర్యం, విద్య, ఆరోగ్యం ప్రాప్తిస్తాయన్నారు. ధర్మానికి మూలం వేదం అని, ఇది భగవంతుని స్వరూపమని అన్నారు.
ప్రతి ఒక్కరూ సత్యమార్గంలో నడవాలని, అప్పడే విజయం చేకూరుతుందని వివరించారు. ప్రతి గ్రామంలో వేద ఘోష వినిపించాలని స్వామీజీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి, బోర్డు సభ్యులు శేఖర్‌రెడ్డి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ జగన్మోహనాచార్యులు పాల్గొన్నారు.