ఆడపిల్లకు జన్మనిచ్చిందని.. ఇంట్లో తన భర్త అనుమతించలేదని ఆందోళనకు దిగింది ఓ భార్య. ఈ ఘటన తిరుమలలో చోటుచేసుకుంది. తిరుమలలోని బాలాజీనగర్‌లో నివాసముండే ఏడుకొండలు, విజయలక్ష్మి భార్యభర్తలు. విజయలక్ష్మి గర్భం ధరించాక భర్తతో తగాదకు దిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. కూతురు పుట్టిందనే విషయాన్ని భర్తకు తెలిపింది.
అయితే ఏడుకొండలు బిడ్డను చూడటానికి వెళ్లకపోగా ఇంటికి రావద్దని చెప్పేశాడు. దీంతో ఏడాది నుంచి విజయలక్ష్మి పుట్టింటిలోనే ఉంది. పలుమార్లు విజయలక్ష్మి తన భార్త ఇంటికి వెళ్లే ప్రయత్నం చేసినా లోపలికి అనుమతించలేదు. దీంతో విజయలక్ష్మి 11 నెలల కుమార్తె చైత్రతో శుక్రవారం భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఇంట్లోకి అనుమతించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించింది.
పాప పుట్టిన తర్వాత ఇంట్లోకి అనుమతించకపోగా రూ.లక్ష అదనపు కట్నం తీసుకురావాలని తన భర్త ఏడుకొండలు, అత్త సరస్వతమ్మ వేధించేవారని బాధితురాలు విజయలక్ష్మి మీడియాకు తెలిపింది. దీంతో పోలీసులు వారిద్దరిని పోలీస్టేషనకు తీసుకువెళ్లారు. డీఎస్‌పీ మునిరామయ్య ఇరు కుటుంబాలతో మాట్లాడి కౌన్సెలింగ్ ద్వారా ఆ జంటను కలిపారు.