తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

ఠాగూర్

మంగళవారం, 21 అక్టోబరు 2025 (14:19 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇక్కట్లుపడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికితోడు వాయుగుండం తరుముకొస్తుండటంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరుమల కొండపై భారీ వర్షం ముంచెత్తింది. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. ఈ వర్షానికి తోడు చలి తీవ్రత అధికంగా ఉండటంతో భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. శ్రీవారి నామస్మరణ చేస్తూ నిత్యం భక్తులతో కిటకిటలాడే మాడ వీధులు ఇపుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. వర్షం కారణంగా భక్తులు షెడ్లలోనే తలదాచుకుంటున్నారు. 
 
మరోవైపు, శ్రీవారి దర్శనం తర్వాత ఆలయం నుంచి బయటకు వచ్చిన భక్తులు తమతమ కాటేజీలకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉండటంతో చిన్నపిల్లలు, వృద్ధులు వణికిపోతున్నారు. కాగా, వర్షం కారణంగా తిరుమల ఘాట్ రోడ్‌లలో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అందువల్ల సొంత వాహనాల్లో వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని తితిదే విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు.
 
అల్పపీడనం.. దూసుకొస్తున్న వాయుగుండం... ఏపీకి ఆరెంజ్ అలెర్ట్ 
 
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వచ్చే 36 గంటల్లో వాయుగుండంగా మారే ప్రమాదం ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, తిరుపతి సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల ఏపీకి ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసినట్టు పేర్కొంది.
 
అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, కడప జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అందువల్ల ఆయా జిల్లాల ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. బుధవారం నాటికి వాతావరణం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
 
ఒకవైపు అల్పపీడనం, మరోవైపు దూసుకొస్తున్న వాయుగుండం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందవల్ల బుధవారం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు