పరమ పవిత్రంగా భావించే తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారం ఇపుడు సుప్రీంకోర్టు చెంతకు చేరింది. ఈ వ్యవహరంపై ప్రత్యేక దర్యాప్తు అధికారి నియామకం చెల్లదని హైకోర్టు పేర్కొంది. దీన్ని సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. అయితే, ఈ పిటిషన్‌పై పూర్తి స్థాయి విచారణ ఈ నల 26వ తేదీన జరుగనుంది.
ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరుపుతోంది. ఈ బృందంలోని దర్యాప్తు అధికారి వెంకట్రావు, విచారణలో భాగంగా చిన్నప్పన్న అనే వ్యక్తికి నోటీసులు జారీ చేశారు. అయితే, ఆ నోటీసులను సవాల్ చేస్తూ చిన్నప్పన్న హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, సిట్‌లో వెంకట్రావు నియామకం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని పేర్కొంది. అందువల్ల, ఆయన దర్యాప్తును కొనసాగించరాదని ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సీబీఐ డైరెక్టర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, ఈ కేసు విచారణను వాయిదా వేయాలని కోరారు. తమ వాదనలు వినిపించేందుకు ఈ నెల 26న అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ అభ్యర్థనను అంగీకరించిన ధర్మాసనం, కేసును ఈ నెల 26న విచారణ జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తుందా? లేక కొట్టివేస్తుందా? అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.