వైకాపా ఎంపీలు గొర్రెల మంద.. ఆ మందలో మరో గొర్రె చేరితే...: నారా లోకేశ్

సోమవారం, 5 ఏప్రియల్ 2021 (10:18 IST)
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైకాపా ఎంపీలను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైకాపా ఎంపీలను గొర్రెల మందతో పోల్చారు. ఈ గొర్రెల మందకు మరో గొర్రె చేరితో ఏమవుతుందని ఆయన నిలదీశారు. 
 
ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా నారా లోకేష్ ప్రచారం చేస్తూ, సీఎం జగన్, వైసీపీ ఎంపీపై మండిపడ్డారు. 21 మంది లోక్‌సభ‌లో, ఆరుగురు రాజ్యసభ‌లో ఎంపీలుగా ఉండి ఏం సాధించారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ పార్టీకి ఉన్నది ముగ్గురే ఎంపీలు అయినా పార్లమెంట్‌లో సింహాల్లా పోరాడుతున్నారని గుర్తుచేశారు. 
 
ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, పోలవరం, విశాఖ రైల్వే జోన్ ఇలా అన్ని అంశాల్లోనూ కేంద్రాన్ని నిలదీసేది ఒక్క తెలుగుదేశం పార్టీ ఎంపీలు మాత్రమేనన్నారు. కేంద్రం ఏమి చెబితే దానికి తలాడించే గొర్రెల మందలో ఇంకో గొర్రె చేరితే లాభం ఏమైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. 
 
పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతు కావాలని, ప్రధాని మోడీని చూసి ప్యాంట్ తడుపుకునే బ్యాచ్ కాదని లోకేశ్ ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రిగా పని చేసి సుదీర్ఘ అనుభవం ఉన్న పనబాక లక్ష్మిని టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబెట్టామన్నారు. 
 
'ఒక మహిళగా ఇంట్లో ఆడవాళ్లు పడే కష్టం ఆమెకు తెలుసు. ఒక ఎంపీగా ప్రజల సమస్యలు పరిష్కరించడం కూడా ఆమెకు తెలుసు. పార్లమెంట్‌లో గర్జించి ప్రజలకు సేవ చేసే మీ ఇంటి లక్ష్మి కావాలో?.. పార్లమెంట్‌లో పడుకొని జగన్ రెడ్డి పాదసేవ చేసే ఎంపీ కావాలో మీరే తేల్చుకోవాలి' అని లోకేశ్ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు