హుజూర్‌నగర్‌లో కనిపించని కారు జోరు.. తెరాస కార్యకర్తల్లో నైరాశ్యం

శనివారం, 19 అక్టోబరు 2019 (09:18 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎపుడు వొచ్చిన అధికార తెరాస పార్టీతో విజయం. ఇక ఉప ఎన్నికల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రకటన వెలువడక ముందు నుంచే ఎన్నికల్లో విజయం కోసం క్షేత్రస్థాయి నుంచి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ వరకు నిరంతరం శ్రమిస్తుంటారు. దశల వారీగా ప్రచార హోరును పెంచుతూ చివరకు కేసీఆర్‌ భారీ బహిరంగ సభను బ్రహ్మాస్త్రంగా ప్రయోగించి విజయబావుటా ఎగురవేస్తారు. 
 
అయితే నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ప్రచార తీరు, హోరు కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ కీలక నేతలు ప్రారంభంలో మంచి జోరును చూపారు. అది ఆరంభానికే పరిమితమైంది. హుజూర్‌నగర్‌లో ఆ పార్టీ ప్రచారంలో తడబడుతోంది. స్టార్‌ క్యాంపెయినర్లు ఎవరూ ప్రచారంలో పాల్గొనకపోవడం, సీఎం కేసీఆర్‌ సభ రద్దు కావడం గులాబీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
 
హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో విస్తృతంగా రోడ్‌షోలు నిర్వహించాలని ముందుగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ నిర్ణయించారు. ఆ మేరకు నియోజకవర్గంలోని 7 మండలాల కోసం 4 రోజుల షెడ్యూల్‌ను విడుదల చేశారు. అయితే హుజూర్‌నగర్‌ కేంద్రంలోని ఒకే ఒక్క రోడ్‌షోతో కేటీఆర్‌ తన ప్రచారాన్ని ముగించేశారు. ప్రచార లోటును పూడ్చేందుకు పార్టీ నాయకత్వం ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌రావు లాంటి నేతలను ఎందుకు వినియోగించుకోవడం లేదని టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో పెద్దఎత్తున చర్చ కొనసాగుతోంది.
 
పైగా, ప్రచారానికి మండలానికో మంత్రి బాధ్యత తీసుకుంటారని ఆదిలో అనుకున్నా.. మంత్రి జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌ మాత్రమే చివరి వరకు ప్రచారంలో ఉన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డికి కాకుండా.. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఇన్‌చార్జి బాధ్యతలను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి అప్పగించడంతో స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా చూస్తే గతానికి భిన్నంగా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక వ్యూహంలో టీఆర్‌ఎస్‌ తడబాటుకు గురవుతున్నట్లు స్పష్టమవుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు