తితిదేకి రూ.2 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైన గుబ్బా చౌల్ట్రీ

ఆదివారం, 8 మే 2016 (11:43 IST)
తిరుమలలోని అన్నదానానికి అనుమతులు తీసుకుని 27 సంవత్సరాల పాటు హోటల్‌ నిర్వహించిన గుబ్బా చౌల్ట్రీ తితిదేకు 2 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది. అయితే దీనిపై తితిదే అధికారులే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తిరుమలలో గుబ్బా చౌల్ట్రీ అనుమతులు పొందే సమయంలో సముదాయం కింది భాగంలో ఉచిత అన్నదానానికి అనుమతులు తీసుకున్నారు. అన్నదానం బదులు 27 సంవత్సరాల క్రితం హోటల్‌ నిర్వహణ ప్రారంభించారు. తితిదే నుంచి అనుమతులు తీసుకోకుండా ఎలాంటి రుసుం చెల్లించకుండా యేళ్ళ తరబడి నిర్వహించారు. 
 
విషయం తెలుసుకున్న తితిదే ఈఓ సాంబశివరావు హోటల్‌‌ను ఆరు నెలల క్రితం జప్తు చేశారు. ఆ తర్వాత తిరుమల పంచాయతీ అధికారులు చౌల్ట్రీకి నోటీసులు జారీ చేశారు. దేవస్థానం న్యాయవాది ద్వారా మరో నోటీసు ఇచ్చారు. ఈ నోటీసులకు చౌల్ట్రీ నిర్వాహకులు కొన్ని రోజులకు ముందు సమాధానం ఇచ్చారు. 
 
ఇందులో తాము చేసింది తప్పేనని, హోటల్‌ను లీజ్‌కు ఇవ్వడం ద్వారా ఇన్నాళ్ళు రూ.కోటి 72 లక్షల రూపాయలు మొత్తం వచ్చిందని వివరించారు. ఆ మొత్తానికి వడ్డీ కలిపి 2 కోట్లు చెల్లిస్తామని సంజాయిషీ ఇచ్చారు. ఈ విషయంపై తితిదే ఈఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. 

వెబ్దునియా పై చదవండి