విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల శాఖామంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శుభవార్త చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చునంతటినీ భరిస్తానని వెల్లడించారు. శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. ఆ తర్వాత పోలవరం నిర్వాసితులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి షెకావత్ మాట్లాడుతూ, పోలవరం నిర్మాణానికి ఉపయోగించే ప్రతి రాయి ఖర్చును కేంద్రం భరిస్తుందన్నారు. గతంలో చెప్పినట్టుగా ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును కేంద్రం దశల వారీగా విడుదల చేస్తుందన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు, సవాళ్లను పరిశీలించామన్నారు. పనుల పురోగతిలో అడ్డంకులను అధికమించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.