వల్లభనేని వంశీకి తీరని కష్టాలు.. బెయిల్ వచ్చినా మరో కేసులో రిమాండ్

ఠాగూర్

శుక్రవారం, 16 మే 2025 (16:43 IST)
వైకాపా మాజీ నేత వల్లభనేని వంశీకి జైలు కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. గత 95 రోజులుగా ఆయన జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఓ కేసులో బెయిల్ దొరికినప్పటికి ఇతర కేసుల్లో పీటీ వారెంట్లు ఆయనను వెంటాడుతున్నాయి. తాజాగా నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ కేసు మెడకు చుట్టుకుంది. గత వైకాపా ప్రభుత్వంలో ఈ కేసు నుంచి ఆయన విముక్తిపొందారు. 
 
కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఈ కేసును పునఃవిచారణకు చేయడంతో వల్లభనేని వంశీ పేరును ఓ నిందితుడుగా చేర్చారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ లభించినా.. మట్టి తవ్వకాల కేసు సిద్దంగా ఉంది. మట్టి తవ్వకాల కేసు విచారణను ఏసీబీ అప్పగించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో ఆయన మరికొద్ది రోజులు జైలు జీవితానికే పరిమితం కావాల్సి వుంటుంది. 
 
ఈ నకిలీ ఇళ్లపట్టాల కేసును పరిశీలిస్తే, గత 2019 ఎన్నికల సమయంలో గన్నవరంలోని ఓటర్లను ప్రభావితం చేసేందుకు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారన్న ఆరోపణలపై వంశీపై కేసు నమోదైంది. అప్పట్లో ఆయన అధికార పార్టీలో ఉండటంతో ఈ కేసులో వంశీ పాత్ర లేదని పోలీసులు కోర్టుకు నివేదించారు. అయితే, కేసును మాత్రం మూసివేయలేదు. 
 
రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు తిరిగి టీడీపీలో చేరడంతో పరిస్థితులు మారాయి. నకిలీ ఇళ్లపట్టాల వ్యవహారంలో వంశీ పాత్ర ఉందని నిర్ధారించిన పోలీసులు, తాజాగా ఆయన పేరును ఎఫ్ఐఆర్‌‍లో చేర్చారు. ఈ కేసుకు సంబంధించి బాపులపాడులో హనుమాన్ జంక్షన్ పోలీసులు నూజివీడు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ వారెంట్‌పై శుక్రవారం విచారణ జరిగి, వంశీని కోర్టును పరిచే అవకాశం ఉంది. 
 
ఇదిలావుంటే, నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అతడి అనుచరుడు మోహన్ రంగారావుకు కూడా రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏలూరు జిల్లా బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్లపట్టాలు పంపిణీ చేసినట్టు వీరిపై కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 29వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో పాటు పీటీ వారెంట్‌కు అనుమతిచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు