చ‌ట్ట‌స‌భ‌ల్లో స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న‌పై భ‌యం కాదు... ఆవేద‌న‌!

బుధవారం, 18 ఆగస్టు 2021 (16:52 IST)
ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించాల్సిన చట్టసభల్లో తరచూ సమావేశాలకు తరచూ కలుగుతున్న అంతరాయాలతో, ప్రజాస్వామ్య వ్యవస్థ నవ్వులపాలు అవుతోంద‌ని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

బెంగళూరులో బుధవారం ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌కేసీసీఐ) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్మారక అవార్డు ప్రదానోత్సవంలో ఉప రాష్ట్రపతి ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల రాజ్యసభలో సమావేశాలకు తరచూ అంతరాయాలు కలగడం, సభ సజావుగా ముందుకు సాగకపోవడం తనకు బాధను కలిగించిందని, అంతే కాకుండా ఇటీవల పలు రాష్ట్రాల శాసన సభల్లో జరిగిన సంఘటనలు, చోటు చేసుకుంటున్న పరిణామాలు తనకు ఆవేదన కలిగించాయని తెలిపారు. పార్లమెంట్ లో ఇటీవల జరిగిన సంఘటనలు దురదృష్టకరమన్న ఉపరాష్ట్రపతి, కొంత మంది సభ్యులు ప్రవర్తించిన తీరు విచారకరమన్నారు. పార్లమెంట్ స్థాయిని దిగజార్చే విధంగా కొందరు సభ్యులు ప్రవర్తించారని, కఠిన చర్యలు తీసుకునే పరిస్థితులు కల్పిస్తున్నారని, ఇదే తనకు దుఃఖాన్ని కలిగించిందని తెలిపారు.

కొందరు పార్లమెంట్ సభ్యుల ప్రవర్తన సభాస్థాయికి తగిన విధంగా లేవన్న ఉపరాష్ట్రపతి, చట్టసభలు చర్చించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రమేనని, అంతరాయాలు కలిగించడం సరైన పద్ధతి కాదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పును గౌరవించాలన్న ఆయన, అసమ్మతిని వ్యక్తం చేయడంలో తప్పు లేదని, నిశితంగా విమర్శించవచ్చని అదే సమయంలో ఎవరి మీద తమ అభిప్రాయాలను బలవంతంగా రుద్దకూడదని స్పష్టం చేశారు. వివిధ స్థాయిల్లో పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు అర్థవంతమైన చర్చల ద్వారా సమావేశాలను ప్రజలకు మేలు కలిగే విధంగా వినియోగించుకోవాలని సూచించారు. భవిష్యత్ లో ఈ పరిస్థితి మారాలని ఆకాంక్షించారు.

ప్రపంచ మేథోసంపత్తి హక్కుల సంస్థ (డబ్ల్యూఐపీవో) 2020 సంవత్సరానికి గానూ విడుదల చేసిన ‘ప్రపంచ ఆవిష్కరణల సూచీ’ (గ్లోబల్ ఇన్నొవేషన్ ఇండెక్స్)లో భారతదేశం ఉత్తమ 50 దేశాల జాబితాలో చోటు దక్కించుకున్న విషయాన్ని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో మరింత శ్రమించి టాప్-10 జాబితాలో నిలవాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. (తాజా జాబితాలో భారతదేశం 48వ స్థానంలో ఉంది.)

విద్యార్థుల్లో చిన్నప్పటినుంచే సృజనాత్మకతను, నూతన ఆవిష్కరణల సంస్కృతిని ప్రోత్సహించాల్సిన ప్రాధాన్యతను తెలియజేసిన ఉపరాష్ట్రపతి, ఈ దిశగా అభ్యాసన-విద్యాబోధన ప్రక్రియలో చిన్నారుల్లో కొత్త విషయాలను తెలుసుకోవాలన్న ఉత్సుకతను పెంపొందించాలన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ఈ దిశగా ప్రయత్నిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు తమ సృజనాత్మకతను చాటుకునేందుకు అవసరమైన ‘ఇన్నొవేషన్ హబ్స్’ ను కళాశాలల్లో ఏర్పాటు చేయాలన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు