పార్లమెంట్ ఉభయ సభలు వాయిదాపడ్డాయి. రెండు రోజులు ముందుగానే ఈ రెండు సభలు వాయిదావేశారు. ముఖ్యంగా, రాజ్యసభలో ఎంపీలు అనుచితంగా ప్రవర్తించారు. మంగళవారం సభలో కొన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఛైర్మన్ స్థానంలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు భావోద్వేగానికి గురయ్యారు.
'ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ దేవాలయం లాంటింది. కొందరు సభ్యులు అమర్యాదగా ప్రవర్తించారు. చట్టసభల పవిత్రను దెబ్బతీశారు. టేబుల్‌పై కూర్చున్నారు. మరికొందరు టేబుల్స్‌పై నిలబడ్డారు. పోడియం ఎక్కి నిరసన తెలపడమంటే గర్భగుడిలో నిరసన తెలిపినట్లే. నిన్నటి పరిణామాలను తలచుకుంటే నిద్ర పట్టే పరిస్థితి లేదు. ఇది చాలా దురదృష్టకరమైన పరిణమం. సభలో ఇన్ని రోజుల పాటు కార్యకలాపాలను స్తంభింపజేయడం మంచిది కాదు' అని వెంకయ్య నాయుడు అన్నారు.
కాగా, మంగళవారం రాజ్యసభలో రచ్చ జరిగింది. రైతుల సమస్యలపై చర్చ జరుగుతుండగా.. కొందరు సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లటి వస్త్రాలను సభలో ప్రదర్శించారు. రూల్ బేక్‌ని చింపేసి గాల్లోకి విసిరేశారు.