దివ్యతేజస్విని హత్యే... నిర్ధారించిన పోలీసులు... నాగేంద్ర అరెస్టుకు సిద్ధం!

మంగళవారం, 27 అక్టోబరు 2020 (12:10 IST)
ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్యతేజస్విని హత్య కేసు నిందితుడు నాగేంద్రబాబు పరిస్థితి నిలకడగా ఉన్నట్టు గుంటూరు సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) వైద్యులు తెలిపారు. సోమవారం నిందితుడిని పరిశీలించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ ప్రభావతి అనంతరం మీడియాతో మాట్లాడారు. 
 
ఈ నెల 15న నాగేంద్రబాబు ఆసుపత్రిలో చేరినప్పుడు అతడి పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. కత్తిపోట్ల కారణంగా పేగులు తెగిపోయి రక్తస్రావం కావడంతో పలు అవయవాలు దెబ్బతిన్నట్టు చెప్పారు. అయితే, ఆపరేషన్ తర్వాత ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. వైద్యుల సూచన ప్రకారం అతడిని డిశ్చార్జ్ చేస్తామని ప్రభావతి తెలిపారు. 
 
మరోవైపు, ఈ హత్య కేసు విచారణ పూర్తి అయ్యింది. దివ్యది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్‌ నివేదికల ఆధారంగా హత్యగా తేల్చారు. దివ్య ఒంటిపై గుర్తించిన కత్తిపోట్లు తనకు తానుగా చేసుకున్నవి కాదని, నిందితుడు నాగేంద్రనే హత్య చేసినట్లు నిర్ధారించారు. 
 
దీనికి సంబంధించి సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను కూడా సేకరించారు. తమ ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపకపోవడంతో ఇద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని, దివ్యను తాను హత్య చేయలేదని నిందితుడు నాగేంద్ర పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం తప్పని తేల్చారు. కేసుకు సంబంధించి దిశా పోలీసులు ఈనెల 28న ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసే అవకాశం ఉంది.
 
అలాగే ఆసుపత్రి నుంచి నిందితుడు నాగేంద్ర డిశ్చార్జి కాగానే అదుపులోకి తీసుకొని విచారించి మరికొన్ని విషయాలను రాబట్టనున్నారు. మరోవైపు ఇరువురి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ బయటకు లీక్‌ కావడంతో వాటి ఆధారంగా విచారణ చేస్తున్నారు. 
 
కాగా విజయవాడలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని (22)పై బుడిగి నాగేంద్రబాబు (25) అలియాస్‌ చిన్నస్వామి కత్తితో దాడిచేసి హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధిత కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డితో పాటు హోంమంత్రి సుచరిత పలువురు మంత్రులు పరామర్శించారు. వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు