తిరుమల వెంకన్న భక్తులకు ఓ శుభవార్త.. రూ.4వేలు చెల్లిస్తే?

బుధవారం, 13 జూన్ 2018 (12:32 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు ఓ శుభవార్త. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చినా శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి ఇక క్యూలైన్లలో వేచి చూసే లక్షలాది మంది భక్తుల కోసం ఏపీ సర్కారు బంపరాఫర్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో జూన్ ఆఖరు నుంచి ప్రారంభం కానున్న ఏపీటీడీసీ బస్సు ఎక్కితే, గంట నుంచి గంటన్నర వ్యవధిలోనే స్వామివారి దర్శనం చేయిస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. 
 
ప్రత్యేక ప్యాకేజీ కింద ఈ బస్సును విశాఖపట్నం నుంచి తిరుమలకు నడుపనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అత్యాధునికమైన ఈ బస్సును నడిపేందుకు బెంగళూరులో డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. తిరుపతి, విశాఖ డిపోలకు బస్సులను కేటాయిస్తున్నామని వెల్లడించారు. 43 సీట్లుండే ఈ బస్సులో ఎక్కాలంటే ఒక్కొక్కరికీ రూ. 4వేల వరకూ వసూలు చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు విశాఖలో బయలుదేరే బస్సు మరుసటి రోజు ఉదయం తిరుపతికి వెళుతుంది.
 
తిరుపతిలోనే యాత్రికులకు వసతి సౌకర్యాలు కల్పించి.. అక్కడి నుంచి మరో ఆర్టీసీ బస్సులో తిరుమలకు తీసుకెళ్తారు. ఆపై శ్రీవారి దర్శనం చేయించి కిందకు తీసుకొస్తారని, అదే రోజు మధ్యాహ్నం తిరిగి బయలుదేరే బస్సు శ్రీకాళహస్తిలో దర్శనం తరువాత, మరుసటి రోజు విశాఖ చేరుకుంటుందని ఏపీ సర్కారు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు టీటీడీ అధికారులతో ప్రభుత్వాధికారులు ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు