కృష్ణా జిల్లా తోట్లవల్లూరుకు చెందిన కోలపల్లి సౌజన్య అనే గృహిణ తన ఇద్దరు బిడ్డలతో కట్టుబట్టలతో మిగిలింది. కరోనా వ్యాధితో గత వారం రోజుల్లో భర్త, అత్త బలయ్యారు. వాళ్లను రక్షించేందుకు ప్రయివేటు ఆసుపత్రికి పాతిక లక్షలు ఖర్చయింది. ఉన్న ఒక్క ఎకరం పొలం అమ్ముకున్నాం. అయినా అయినవాళ్ల ప్రాణం దక్కలేదు. నేను నా ఇద్దరు పిల్లలు కట్టు బట్టలతో మిగిలాం... మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకో్వాలంటూ... ఓ మహిళ ఆక్రోశిస్తోంది.
ప్రభుత్వ వైద్యం అందక భర్త, అత్తలను విజయవాడ శివారులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చామని, అక్కడ వారంలోనే ఇద్దరూ చనిపోయారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆసుపత్రి ఖర్చులంటూ...భర్తకు 15 లక్షలు, అత్తకు పది లక్షల బిల్లు వేశారని, ఇలా 25 లక్షలు క్షవరం! అయిపోయిందని చివరికి తనకు బిడ్డలను పోషించడానికి ఏమీ మిగలలేదని సౌజన్య శోకిస్తోంది.
తన ఇద్దరు బిడ్డలకు దిక్కెవరని ప్రశ్నిస్తోంది.
గత రెండు సంవత్సరాలలో కరోనా రెండు విడతల్లో ఇలాంటి దీన గాధలు, దాదాపు అన్ని ఊర్లలో ఉన్నాయి. మరో పక్క లాక్ డౌన్లతో ఆర్ధిక వ్యవస్థ చాలా దెబ్బతిని బతుకు తెరువు దొరకడం లేదు. కరోనా విలయ తాండవంతో అనాధలైన కుటుంబాలకు ఎప్పటికి ఆసరా లభిస్తుందో తెలియని దుస్థితి.