జూలై 31వ తేదీ వరకు అంతర్జాతీయ విమానాల‌పై నిషేధం పొడిగింపు

బుధవారం, 30 జూన్ 2021 (17:11 IST)
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం కేసులు 50 వేలకు దిగువన నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం.. అంతర్జాతీయ విమానాల‌పై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. 
 
అంత‌ర్జాతీయ‌ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని జూలై 31వ తేదీ వరకు పొడగిస్తున్నట్లు జాయింట్‌ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం ప్రకటనను విడుదల చేసింది. అయితే, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లు, విమానాలకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించవని వెల్లడించింది.
 
కరోనా మహమ్మారి ప్రభావంతో గతేడాది మార్చిలో అంతర్జాతీయ కమర్షియల్‌, ప్యాసింజర్‌ విమానాలపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. పలు దేశాల్లో చిక్కుకుపోయిన వారి కోసం కేంద్రం ప్రత్యేకంగా వందే భారత్‌ మిషన్‌ కింద విమానాల సర్వీసులతో స్వదేశానికి తీసుకువచ్చింది. 
 
ఆ తర్వాత పలు దేశాలతో ఎయిర్‌ బబుల్‌ కింద పలు దేశాలతో జూలై నుంచి ఒప్పందాలు చేసుకొని సర్వీసులు నడుపుతోంది. దీనిలో భాగంగా అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా 27 దేశాలతో భార‌త్‌ ఒప్పందాలు చేసుకొని సర్వీసులు నడుపడటంతోపాటు.. స్వదేశంలోకి అనుమతి ఇస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు