తెలుగుభాష ఔన్నత్యాన్ని వివరిస్తూ ఆయన పాడిన గేయాలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కళాశాల కార్యదర్శి గుండా గంగాధర్ మాట్లాడుతూ మనిషిని మనిషిగా తీర్చిదిద్దే విలువలు ఆంధ్రసాహిత్యంలో ఉన్నాయని, బాల్యం నుంచే సాహిత్యాన్ని అధ్యయనం చెయ్యటం ద్వారా బాలల్ని ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందన్నారు.
పాశ్చాత్య సంస్కృతి, భాష పట్ల వ్యామోహంతో మన భాషను విస్మరించటం తగదన్నారు. తెలుగు అధ్యాపకురాలు ఐ.ఉషారాణి మాట్లాడుతూ ఇతర ఉపాధ్యాయులు కేవలం విషయ జ్ఞానాన్ని మాత్రమే అందిస్తారని, కేవలం తెలుగు ఉపాధ్యాయుడు మాత్రమే వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే విద్యను అందిస్తాడని చెప్పారు.
తెలుగు వైభవాన్ని ప్రకటిస్తూ విద్యార్థులు నృత్యాలు, ఏకాంకిలు (స్కిట్స్) ప్రదర్శించారు. పలు గేయాలు గానం చేశారు. సభలో బీఈడీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ జి.గరటారెడ్డి, డీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ బిహెచ్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ కె.రామకృష్ణ కార్యక్రమాన్ని నిర్వహించారు.