దేశాభివృద్ధికి బాటలు వేయాలి.. మంత్రి సురేష్‌

గురువారం, 5 సెప్టెంబరు 2019 (19:34 IST)
అక్షర జ్ఙానం ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని, దేశ, రాష్ట్ర భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని, విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్ది దేశాభివృద్ధికి బాటలు వేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ సూచించారు.

విజయవాడలోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో గురుపూజోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. గురుపూజోత్సవ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి సురేష్‌ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు.

విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యంగా, రుచికరంగా అందించాలని పాఠశాలల్లో సెంట్రలైజ్‌ కిచన్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమరూప దుస్తులు, పాదరక్షలు, విద్యార్థుల్లో నైపుణ్య అభివృద్ధి కోసం పార్లమెంట్‌ నియోజకవర్గంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారన్నారు.

ప్రైవేట్‌ విద్యా సంస్థలపై రెగ్యులేటరీ కమిషన్‌ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని విద్యా శాఖ మంత్రి సురేష్‌ చెప్పారు. గత ప్రభుత్వం ప్రైవేటీకరణకు పెద్ద పీట వేసిందని, దాని వల్ల కలిగిన దుష్ఫలితాలను ఇంకా అనుభవిస్తున్నామన్నారు. వాటికి కళ్లెం వేసే విధంగా రెగ్యులేటరీ కమిషన్‌ తీసుకువచ్చామన్నారు.

అక్షర జ్ఞానం ఆర్థికాభివృద్ధికి దోహదపడతుంది. అక్షరజ్ఞానం లేని సమాజాలు అంధకారంవైపుకు వెళ్తున్న పరిస్థితులు చూస్తున్నాం. అక్షర స్పర్షతోనే అభివృద్ధి జరగదు.. దానికి తోడు సృజనాత్మక ఆలోచనలు రేకెత్తించాలి. సంపద సృష్టించాలి. ప్రకృతి వనరులను వినియోగించుకొని నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని మంత్రి సురేష్‌ ఉపాధ్యాయులకు సూచించారు.

మానవ వనరుల అభివృద్ధి కేవలం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని అందరం గుర్తించాలన్నారు. ఉపాధ్యాయ వృత్తికి పునరంకితం అవుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందని సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు