మరణాలను కనీస స్థాయికి తగ్గించగలిగాం: కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ కమిటీ

శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (08:18 IST)
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి, మరణాలను కనీస స్థాయికి తగ్గించగలిగామని సమాచార, పౌరసంబంధాల శాఖ కమీషనర్, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో ప్రత్యేక కార్యదర్శి మరియు కోవిడ్-19 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి  ప్రకటనలో తెలిపారు.

పౌరసరఫరాలు, పౌర అవసరాలను ప్రత్యేక ప్రణాళికతో అనుసంధానం చేయడంతో పాటు భౌతిక దూరాన్ని క్రమబద్దంగా పాటించటం వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న స్థాయిలో  కట్టడి చేయగలిగిందన్నారు. 
 
ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడానికి ప్రచార మాధ్యమాలను ఉపయోగించడం జరుగుతోందన్నారు. వ్యాధిపట్ల ప్రజల్లో అవగాహన పెంచి వైరస్ ను అరికట్టడానికి  పటిష్టమైన ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాలు పక్క రాష్ట్రాల కన్నా తక్కువగా నమోదు అవుతున్నాయన్నారు.

అదేవిధంగా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా 104 మరియు 1902 టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా పక్కాగా శాంతి, భద్రతలు కాపాడటం జరుగుతోందన్నారు.

గ్రామ వారియర్స్ అయిన గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా సర్వే నిర్వహించడం ద్వారా ప్రజల ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు.

ప్రజలకు అవసరమైన మందులు, నిత్యవసరాలు, కూరగాయల ధరల అదుపుకు పటిష్టమైన చర్యలతో పాటు షాపుల ముందు ధరల పట్టిక ప్రదర్శించేలా చేయడం, ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం వల్ల రోడ్లపై జనసంచారం తగ్గి  కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టగలిగామన్నారు.

అంతేకాకుండా పట్టణాల నుంచి గ్రామాలకు వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ఎక్కడకక్కడ చర్యలు చేపట్టిందన్నారు. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే వైరస్ వ్యాప్తి చెందకుండా, కోవిడ్ మరణాలు పెరగకుండా ఏపీ ప్రభుత్వం మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు.

ఆసుపత్రుల్లో మాస్కులు, శానిటైజర్లను డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. 
 
ఓ వైపు ఆధునిక సాంకేతికతను వాడుకుంటూనే, మరో వైపు భౌతిక దూరం పాటించాలంటూ ప్రజలకు దిశా నిర్దేశం చేస్తోందన్నారు. హోమ్ క్వారంటైన్స్ లో ఉన్న వారి కదలికలను గుర్తించడానికి ‘కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ సిస్టమ్‌’  ను ఏపీ సర్కారు ప్రవేశపెట్టిందన్నారు. 

దేశంలోనే తొలిసారిగా ఈ తరహా సాఫ్ట్ వేర్‌ ను స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తయారు చేసిందని తెలిపారు. ఒకేసారి 25 వేల మంది కదలికలను ఈ సాఫ్ట్ వేర్ పసిగట్టగలదన్నారు.

‘కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ సిస్టమ్‌’కు హోమ్ క్వారంటైన్స్ లో ఉండే వారి సెల్ ఫోన్ నంబర్‌ ను అనుసంధానించడం ద్వారా సెల్ టవర్,  సర్వీసు ప్రొవైడర్ల ద్వారా హోమ్ క్వారంటైన్స్ లో ఉన్న వారి కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టొచ్చన్నారు.

దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో విశాఖ మెడ్ టెక్ జోన్‌ లో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల తయారీ, ఒక్కో కిట్ ద్వారా రోజుకు 20 టెస్టులు చేయడం తో పాటు గంటలోపే టెస్టింగ్ రిపోర్ట్ వచ్చే అవకాశం అందుబాటులోకి వచ్చిందన్నారు. 

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పలువురు నిపుణులు కూడా ప్రశంసిస్తున్నారని, సాంకేతికత ను ఉపయోగించి కరోనా కేసులను కట్టడి చేసే దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు భేష్ అంటూ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారని కోవిడ్-19 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు