ఈ సందర్భంగా హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా చేనేత బతుకుల్లో చీకట్లు అలముకున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చాక చేనేతల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, అనతి కాలంలోనే చేనేత పరిశ్రమ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.
ఆప్కో చైర్మన్ గా నాలుగు నెలల క్రితం బాధ్యతలు చేపట్టిన చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు రాష్ట్ర వ్యాపితంగా పర్యటించి చేనేతల స్థితిగతులను అధ్యయనం చేసి, పాత డిజైన్లకు స్వస్తి పలికి ట్రెండ్ కు అనుగుణంగా నూతన డిజైన్లు రూపొందించాలని, రంగుల వాడకంలోనూ కొత్త ఒరవడిని అవలంభించాలని నేత కార్మికులకు సూచించారు.
తన స్వీయ పర్యవేక్షణలో అనేక నూతన డిజైన్లకు రూపకల్పన చేసారు. అలా తయారైన చేనేత చీరలకు విస్తృతమైన ప్రచారం కల్పించి చేనేత రంగం, ఆప్కో సంస్థలను బలోపేతం చేయాలనే సంకల్పంతో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నూతన డిజైన్లతో తయారైన చీరలను హోమ్ మంత్రి సుచరిత చేతుల మీదుగా అందజేసి, వాటి తయారీకి సంబంధించి తీసుకున్న ప్రత్యేక చర్యలను వివరించారు.