ఏపీలో ఆలయాలపై దాడులు : హోం మంత్రి అమిత్ షా ఆరా!

మంగళవారం, 5 జనవరి 2021 (21:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల్లోని విగ్రహమూర్తుల ధ్వంసంపై కేంద్రం సీరియస్ అయింది. ఈ దాడులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఈ మేరకు ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి ఫోన్ చేశారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులను అడిగి తెలుసుకున్నారు. అలాగే రామతీర్థం ఘటనపై అమిత్‌షా ఆరా తీశారు. 
 
మరోవైపు సోమువీర్రాజు నేతృత్వంలో జనసేన కార్యకర్తలతో కలిసి మంగళవారం రామతీర్థం సందర్శనకు వెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిరంకుశ విధానాలకు ఇది పరాకాష్టగా నిలిచిందని చెప్పారు. రాష్ట్రంలో హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని చెప్పారు. 
 
రాష్ట్రంలో అన్యమత ప్రచారం పెరిగిపోయిందని.. దీనిలో భాగంగానే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. తిరుమల, శ్రీశైలం, అన్నవరం ఘటనలపై కూడా ఆయన మాట్లాడారు. 
 
ఆలయాల ఘటనలపై వైసీపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలు అనుసరిస్తోందని సోము వీర్రాజు చెప్పారు. కంటితుడుపు చర్యగా మాత్రమే  వైసీపీ సర్కారు స్పందించిదని.. దోషులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని చెప్పారు. పోలీసు వ్యవస్థ ప్రభుత్వ కనుసన్నుల్లో పనిచేస్తోందన్నారు. 
 
ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని చెప్పారు.  రామతీర్థం, పైడితల్లి, మండపల్లి ధర్మకర్తగా ఉన్న అశోక గజపతిరాజుని తొలగించారని చెప్పారు. గతవారం టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా రామతీర్థం సందర్శనకు వచ్చాయన్నారు. 
 
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వచ్చినప్పుడు కొంతమంది దుండగులు విజయసాయి కాన్వాయ్‌పై రాళ్లు వేశారని సోము వీర్రాజు చెప్పారు. ఈ దాడిని విజయసాయి టీడీపీ నాయకులు చేయించినట్లుగా చెప్పారన్నారు. వైసీపీ  ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని సోము వీర్రాజు పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు