ఏపీకి అల్పపీడనం ముప్పు తప్పేలా లేదు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. వాయుగుండంగా తీవ్ర అల్పపీడనం బలపడనుంది. 48 గంటల్లో వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు పయనించనుంది. దీని ప్రభావంతో రాగల మూడ్రోజులపాటు కోస్తాంధ్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆదివారం ఏపీలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమబెంగాల్ -ఒడిశా-ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. గుజరాత్‌లో ఆరెంజ్ అలెర్ట్ విధించారు.