జిల్లాలోని కొంతేరు పంచాయతీ లేతమామిడితోటకు చెందిన లక్ష్మణదాసు అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ల క్రితం భార్య చనిపోవడంతో ఆయన ఒంటరిగా జీవిస్తున్నారు. పెద్ద కుమారుడు తులసీరావు ఆర్టీసీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తుండగా, రెండో కుమారుడు చిరంజీవి, కోడలు రజనీ లక్ష్మణదాసు ఇంట్లోనే ఉంటున్నారు.
లక్ష్మణదాసుకు ప్రభుత్వం ఇచ్చిన 5 సెంట్లతో పాటు మరో ఐదు సెంట్ల స్థలం ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్థలాన్ని తన పేర రాయాలని చిరంజీవి తండ్రిపై ఒత్తిడి చేశాడు. దీంతో ఇద్దరు కొడుకుల పేర్లపై చెరో 5 సెంట్ల భూమిని రాసేందుకు లక్ష్మణదాసు అంగీకరించి, ఆ దిశగా ఆయన పనులు చేపట్టారు.
తన వేధింపులకు తండ్రిలో చలనం లేకపోవడంతో చివరికి పెంపుడు కుక్కను తండ్రిపై ఉసిగొల్పి వేధించడం ప్రారంభించారు. దీంతో సదరు పెద్దాయన తహసిల్దార్ వి.స్వామినాయుడిని ఆశ్రయించి తన బాధను వెళ్లదీశాడు. తన ప్రాణాలకు ముప్పు ఉందనీ, రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు ఆయన వినపత్రం సమర్పించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.