తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు పలికిన రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ తెలుగు నేలతో తనకున్న అనుబంధాన్ని తల్చుకుని భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు నేలతో తనకు విడదీయరాని అనుబంధం ఉన్నదని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పైగా తెలుగు నేల తనకు మరు జన్మను ప్రసాదించిందని కూడా చెప్పారు.
హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో మంగళవారం రాత్రి ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించిన సందర్భంగా గవర్నర్ హేవళంబి సంవత్సరం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రజలకు సుఖసంతోషాలు ఇవ్వాలని, రెండు రాష్టాలూ సమృద్ధిని సాధించాలని కోరుకున్నారు. రాజ్ భవన్‌లో తన ముందు రెండు రాష్టాలు ఉన్నాయని, ఇలాగే కలిసి మెలిసి ఉండాలని కోరుకున్న గవర్నర్ తనకు తెలుగు రాష్ట్లాలు అంటే ఎందుకు అంత ఇష్టమో చెబుతూ పాత జ్ఞాపకాలు పంచుకున్నారు.
గవర్నర్ చెప్పిన మాటల బట్టి ఆయన చదువు తెలుగునేలపైనే మొదలైంద. ఆయన మొదటి ఉద్యోగం కూడా తెలుగు గడ్డపైనే ప్రారంభమైంది. పైగా నలభై ఆరేళ్ల కిందట కర్నూలు జిల్లాలో జరిగిన ఒక దుర్ఘటనలో ఆయన రెండు రోజులపాటు కోమాలోకి వెళ్లి బతికిబయట పడ్డారు. తెలుగు నేల తనకు పునర్జన్మ ఇచ్చిందని చెప్పిన గవర్నర్ అదికూడా ఉగాది రోజే జరిగిందని, అందుకే ఉగాది అంటే తమ కుటుంబానికి ప్రత్యేకమని చెప్పారు.
కాగా, ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ సీఎల్పీ నేత కె.జానారెడ్డి, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.