ఆర్కేను చంపేశారా? పట్టుకున్నారా? ఏపీ పోలీసులకు హైకోర్టు ధర్మాసనం ఆదేశం

మంగళవారం, 1 నవంబరు 2016 (08:57 IST)
'సమాచారం విషయంలో మావోయిస్టులను తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. వారికుండే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వారికి ఉంటాయి. ఇంతకీ ఆర్కేను ప్రాణాలతో పట్టుకున్నారా.. ఎన్‌కౌంటర్‌లో చనిపోయారా.. అన్న విషయాన్ని స్పష్టం చేయండి' అని ఆంధ్రప్రదేశ్‌ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఆర్కే ప్రాణాలతో పట్టుబడి ఉంటే ప్రాణహాని తలపెట్టరనే కోర్టు బలంగా విశ్వసిస్తోందని వ్యాఖ్యానించింది. 
 
పోలీసులు అక్రమంగా నిర్బంధించిన తన భర్తను కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా ఏపీ పోలీసులను ఆదేశించాలని కోరుతూ మావోయిస్టు పార్టీ అగ్రనేత రామకృష్ణ అలియాస్‌ ఆర్కే భార్య కందుల శిరీష సోమవారం హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా లంచ్‌ మోషన్‌లో వినాలని కోరారు. 
 
ఇందులో ఇరు వర్గాల వాదనలు ఆలకించిన పోలీసులు... 'పరిస్థితి తీవ్రకల్లోలంగా ఉంది. అన్నిటికన్నా మనిషి ప్రాణాలు చాలా ముఖ్యం. అతను మావోయిస్టా.. మరొకరా అనేది అప్రస్తుతం. ప్రజల ప్రాణాలకు తగిన రక్షణ కల్పించడమే ప్రభుత్వాల ప్రధాన ధ్యేయం' అని హితవు పలికింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని స్పెషల్‌ జీపీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. 

వెబ్దునియా పై చదవండి