ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళా కండక్టర్‌ను హత్య చేసి ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. తాజాగా జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఏపీఎస్ఆర్టీసీలో కల్యాణి అనే మహిళ కండక్టర్‌గా పనిచేస్తోంది. రెండు రోజుల కిందట అదృశ్యమైన ఆమె.. ప్రాణాలు కోల్పోయి, సగం కాలిన స్థితిలో కనిపించింది.
ఈమె తన భర్త రాఘవయ్యతో కలిసి గంటూరు నగరంలోని సంపత్ నగర్‌లో నివశిస్తూ వచ్చింది. తన కనిపించడం లేదంటూ భర్త పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. ఇంతలో సోమవారం గుంటూరు శివారు బొంతపాడులో సగం కాలిపోయిన మహిళ శవాన్ని స్థానికులు గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ శవం కల్యాణిదేనని నిర్ధారించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కల్యాణిని భర్త రాఘవయ్యే చంపేసి ఉంటాడని ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. సంపత్ నగర్‌లోని ఇంట్లోనే రోకలి బండతోమోది కల్యాణిని చంపేసి, వాహనంలో శవాన్ని బొంతపాడుకు తీసుకొచ్చి తగులబెట్టి ఉంటారని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం రాఘవయ్యను విచారిస్తున్నామన్న పోలీసులు నిందితులను వదిలిపెట్టబోమని చెప్పారు.