వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

ఠాగూర్

గురువారం, 19 సెప్టెంబరు 2024 (22:24 IST)
వైకాపాకు రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీలో చేరడం ఖాయమైపోయింది. ఆయన గురువారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. జనసేన పార్టీలో చేరికపై చర్చించారు. ఆయనకు పవన్ మనస్ఫూర్తిగా స్వాగతం పలికారు.
 
పవన్‌తో భేటీకి ముందు బాలినేని మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కుటుంబం కదా అని ఇన్ని రోజులు భరించాననని వెల్లడించారు. పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేసినా జగన్ గుర్తించలేదని, కనీసం తన గురించి జగన్ ఒక్క సభలో కూడా మాట్లాడలేదని ఆరోపించారు. కానీ పరిచయం లేకపోయినప్పటికీ పవన్ కల్యాణ్ తన గురించి రెండు, మూడు సార్లు మంచిగా మాట్లాడారని బాలినేని వివరించారు. 
 
పార్టీలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల పట్ల ఏడ్చిన రోజులు ఉన్నాయని, ఇప్పుడు కన్నీళ్లు కూడా ఇంకిపోయాయని తీవ్ర భావోద్వేగంతో చెప్పారు. తానెప్పుడూ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాడని, అదే తనకు ప్రతికూలంగా మారిందని అన్నారు. ప్రజల సమస్యల గురించి చెబితే జగన్‌కు నచ్చేది కాదని, ఓడినా కానీ జగన్‌లో మార్పులేదని విమర్శించారు.
 
ఇక, తాను జగన్‌ను బ్లాక్ మెయిల్ చేసినట్టు కొన్ని యూట్యూబ్ చానళ్లు రాశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను నమ్మి తాను ఆస్తులు పోగొట్టుకున్నానని బాలినేని వెల్లడించారు. గతంలో తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వైసీపీని వీడలేదని తెలిపారు. ఇప్పుడు జనసేన పార్టీలోకి వెళుతోంది అధికారం కోసం కాదని స్పష్టం చేశారు.
 
తనకు పదవులు ముఖ్యం కాదని, ఆత్మాభిమానం ముఖ్యమని బాలినేని ఉద్ఘాటించారు. గతంలో మంత్రి పదవినే వదులుకున్నానని వెల్లడించారు. తాను ఎలాంటి షరతులు విధించకుండా జనసేన పార్టీలో చేరుతున్నానని, పవన్ ఏం చెబితే అది చేస్తానని చెప్పుకొచ్చారు. ఒంగోలులో భారీ సభ ఏర్పాటు చేసి, జనసేన కండువా కప్పుకుంటానని వెల్లడించారు. ఇక, పవన్ తో భేటీ అనంతరం బాలినేని సోషల్ మీడియాలో తన ప్రొఫైల్ పిక్ కూడా మార్చేశారు. పవన్ కు తాను శాలువా కప్పిన ఫొటోను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు