వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకు చేరుకుంది. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతటి అబద్ధాలనైనా మాట్లాడగలరని అన్నారు. ఆయన మాటల్లోనే... " కాపులకు బీసీ రిజర్వేషన్లు రాకపోవడానికి బీజేపి కారణమని చెపుతున్నారు. చిత్తశుద్ధి వుంటే మొదటి ఏడాదిలోనే కాపు రిజర్వేషన్ల కోసం చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రయత్నించలేదు. భాజపాతో విడాకులు తీసుకున్న తర్వాత అన్నిటికీ కారణం భాజపా అని వారి మీద తోసేస్తున్నారు.
చంద్రబాబు లాంటి మోసం చేసే వ్యక్తులను మీరు క్షమిస్తే... ఏం చెపుతాడో తెలుసా. మొదట రాగానే నేను గతంలో చెప్పినవన్నీ 98 శాతం పూర్తి చేసానంటాడు. చిన్నచిన్నవి చెబితే నమ్మరని... ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తామని అంటాడు. కేజీ బంగారం.. ఇచ్చినా నమ్మరేమోనని బెంజి కారు బోనస్‌గా ఇస్తానంటాడు. ఐతే ఒక్కటి మాత్రం చెపుతున్నా. వాళ్లు డబ్బు ఇస్తే మాత్రం చక్కగా తీస్కోండి.. 3 వేలు ఇస్తామంటే ఐదువేలు అడగండి. ఎందుకంటే ఆ డబ్బంతా మనదే. ప్రజల నుంచి దోచుకున్న డబ్బు. దాన్ని తీసుకుని ఓటు మాత్రం మన పార్టీకే వేయండి.
మీ అందరి ఆశీస్సులతో వచ్చే ఏడాది మన ప్రభుత్వం రాగానే నవరత్నాలే నా ధ్యేయం. మీ పిల్లల్ని చదివించే బాధ్యత నాది. ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 20 వేలు ఇస్తా. పిల్లవాడిని తల్లి బడికి పంపిస్తే రూ. 15 వేలు ఇస్తా. 32 శాతం పిల్లలు చదువుకోవడంలేదని లెక్కలు చెపుతున్నాయి. మన రాష్ట్రంలో బిడ్డలందరూ చదువుకుని ఉన్నత స్థానానికి వెళ్లాలి. ఇదే నా లక్ష్యం'' అని చెప్పారు.