2023 నాటికి వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు,భూరక్ష పధకం పూర్తి: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
శనివారం, 4 సెప్టెంబరు 2021 (19:41 IST)
రాష్ట్రంలో వచ్చే 2023 మార్చి నాటికి వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పధకాన్ని పూర్తిగా అమలుచేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వెల్లడించారు.
ఈ మేరకు శనివారం అమరావతి సచివాలయంలో వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పధకం పై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ ధర్మాన కృష్ణదాస్,పంచాతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి,మున్సిపల్ పరిపాలన శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి,బొత్స సత్యనారాయణల ఆధ్వర్యంలో జరిగింది.
అనంతరం మంత్రి పెద్ది రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ పధకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ ఉప సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ ఉప సంఘం తరచు సమావేశమై ఈపధకాన్ని ఏవిధంగా వేగవతంగా ముందుకు తీసుకువళ్ళాలనే దానిపై చర్చించడం జరుగుతోందని పేర్కొన్నారు.
ఎట్టిపరిస్థితుల్లోను వచ్చే 2023 మార్చి నాటికి ఊపధకాన్ని పూర్తిగా అమలు చేసేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.ఇందుకుగాను మంత్రివర్గ సభ్యులం వారం వారం కూర్చిని చర్చించుకుంటున్నామని మరలా ఈనెల16వతేదీన సమావేశం అవుతామని చెప్పారు.
వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు,భూరక్ష పధకం అమలుకు సంబంధించి గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో ఎదురవుతున్న వివిధ భూవివాదాలను ఎంత వేగంగా పరిష్కరించాలనే దానిపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ప్రధానంగా చర్చించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.
ఈ పధకాన్నిఎంత వేగంగా అమలుచేయాలనే దానిపైన ఇతర అంశాలపైన కూడా సమావేశంలో చర్చించినట్టు తెలిపారు.ఈపధకం అమలు పూర్తయితే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
అంతకు ముందు ఎబాలిషన్ ఆఫ్ ఈనామ్ యాక్టుపై ఎంపవర్డ్ కమిటీ సమావేశం ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ ధర్మాన కృష్ణదాస్,పంచాతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి,మున్సిపల్ పరిపాలన,ఆర్ధిక శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి,బొత్స సత్యనారాయణ,బుగ్గన రాజేంద్రనాధ్ ల ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సమావేశంలో ఇందుకు సంబంధించి వివిధ అంశాలపై మంత్రుల బృందం చర్చించింది.అంతుకు ముందు సిసిఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది,సర్వే అండ్ సెటిల్మెంట్,ల్యాండ్ రికార్డ్సు కమీషనర్ సిద్ధార్ధ జైన్ వారి శాఖల పరంగా చేపట్టిన సర్వే తదితర వివరాలను మంత్రుల బృందానికి వివరించారు.
ఈ సమావేశాల్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శమీర్ శర్మ,రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి వి.ఉషారాణి,ఎఎంఆర్డిఏ కమీషనర్ లక్ష్మీనర్సింహ, భూగర్భ గనులశాఖ సంచాలకులు వెంకటరెడ్డి,మున్సిపల్ పరిపాలనశాఖ కమీషనర్ మరియు డైరెక్టర్ నాయక్ ఇతర అధికారులు పాల్గొన్నారు.