భార్య... భర్త కొట్టినందుకు కాదట... తోడి కోడలు తొంగి చూసినందుకట..

బుధవారం, 4 డిశెంబరు 2019 (18:58 IST)
నవ్యాంధ్రలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి చూస్తుంటే భార్యను భర్త కొట్టినందుకు కాదట.. తోడికోడలు తొంగిచూసినందుకు ఫీలయిందంట అన్న సామెతగా ఉందని వైకాపా ఎమ్మెల్యే మేరుగు నాగార్జున వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ఇదే అంశంపై ఆయన మంగళవారం తాడేపల్లిలోని వైకాపా ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, నిన్నటి వరకు ఇసుక...ఇసుక అంటూ నానాయాగి చేశారు. తర్వాత ఇంగ్లీషు మీడియం. ఇప్పుడు రాళ్లు, చెప్పులు, లాఠీలు. 
 
రాజకీయ ధర్మాన్ని నీవు ఏ విధంగా అయినా తాకట్టు పెట్టవచ్చు. రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ప్రజలను ఎంతగా మోసం చేశావో రాజధాని నెపంతో ఎన్ని కోట్లు గడించావో అందుకే ప్రజానీకం బ్రహ్మాండంగా తొక్కేశారు. తాడికొండలో ఓడించారు. చివరకు మీ కుమారుడు పోటి చేసిన మంగళగిరిలో రాజకీయంగా భూస్థాపితం చేశారు. అయినా మీరు సిగ్గుపడటంలేదు.
 
రాజధానిని వరల్డ్‌ క్లాస్‌ క్యాపిటల్‌‌గా కట్టానని అనుకుంటున్నావు. అదే నీ 40 సంవత్సరాల అనుభవం. మీ ఆలోచనలు, మీరు చేసిన తప్పిదాలు ఎలా ఉందంటే పచ్చకామెర్లు వచ్చినవాడికి దేశమంతా అదేవిధంగా కనబడుతుందంట. అలా ఉంది చంద్రబాబు పరిస్దితి. 
 
40 ఏళ్ల అనుభవం ఉన్న మీరు (చంద్రబాబు) ప్రజలకు చేసిన తప్పిదాలను ఎందుకు గుర్తుంచుకోలేకపోతున్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీని ఛీత్కరించి, జగన్‌ పార్టీని 151 నియోజకవర్గాలలో గెలిపించారు. ఇప్పటికైనా చంద్రబాబు తప్పు తెలుసుకోవడం లేదు.
 
నిన్న టిడిపి నేతలు గవర్నర్‌‌ని కలిశారంట. అంబోతులా ఉండే ఆయన దళితులపై దాడులు చేసే ఆయన కర్ర తీసుకువచ్చి దానికి డిజిపి, సీఎం సమాధానం చెప్పాలని కోరారంట. ఏం జరిగిందని సమాధానం చెప్తారు. మీ హయాంలో ఇలాంటివి ఎన్ని జరిగాయి. ఎన్ని చేయించారు. వాటికి ఎప్పుడైనా సమాధానం చెప్పారా?. 
 
రాజధాని ప్రాంతంలో మీ పనితనానికి మీ చేతిలో మోసపోయిన రైతాంగం, కూలిపోగొట్టుకున్న కూలీలు, కూలీ దొరకక హలో లక్ష్మణా అని రాజధాని ప్రాంతం నుంచి వెళ్లిపోయిన పేదలు కసిగా ఉన్నారు. ఎవరేం చేశారో, ఎవరు రాళ్లేశారో, ఎవరు చెప్పులేశారో చివరకు ఆ రాయి ఎక్కడుందో తీసుకురండి. ఆ చెప్పులు ఏ కంపెనీవో తీసుకురమ్మంటే ఇది మీలాంటి పరిపాలన కాదు. 
 
మీ హయాంలోలా పోలీసు అధికారులు కాదు ఇప్పటి అధికారులు. గతంలో సిట్‌ అంటే సిట్‌, స్టాండ్‌ అంటే సిట్ అనే మీ హయాంలోలా కాదు. చంద్రబాబుపై రాళ్లేసిన వారిపై చర్యలు తీసుకుంటారు. అందుకే సంఘటన జరిగిన వెంటనే సిట్‌ వేశారు. బాధ్యులపై చర్యలు ఖచ్చితంగా తీసుకోబడతాయి.
 
మీకు ఇప్పటికైనా పశ్చత్తాపం లేదు. ఓడిపోయారు. మీరు రాజధాని ప్రాంతంలో అందర్ని అంటే రైతులు, దళితులను మోసం చేశారు. దళితులను భయపెట్టి వారి భూములను లాక్కుని చౌకగా కొని మోసం చేశారు. చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిలా ప్రవర్తిస్తూ గ్రాఫిక్స్‌ చూపుతూ నేషనల్‌ మీడియాని కూడా మోసం చేశారు. మీ పనితనం అందరూ గమనిస్తున్నారు.
 
రాజధానిపై రేపు చంద్రబాబు విజయవాడలో అఖిలపక్షం పెడతారంట. మీరు ఈ రౌండ్‌ టేబుల్‌ ఎవరి కోసం పెడతారు. రాజధానిలో 33 వేల ఎకరాలు తీసుకుని వారికి ఏమీ చేయలేదు. గ్రాఫిక్స్‌ చూపి మోసం చేశారు. దళితులను, రైతులను మోసం చేశారు. తోటలను తగులపెట్టారు. వీటన్నింటిపై క్లారిటీ ఇచ్చేందుకు రౌండ్‌ టేబుల్‌ పెడుతున్నారా?.
 
నిజమైన రాజకీయనేతవే అయితే మీరు చేసిన అన్యాయాలపై మేధావులతో చర్చించు. రైతులు, రైతుకూలీలు, దళితులను మోసం చేసిన అంశాలపై చర్చించు. రాజధాని ముందు నూజవీడులో అన్నావు. విజయవాడ అన్నావు.

ఆ తర్వాత నాగార్జున యూనివర్శిటి అన్నావు. తర్వాత తుళ్లూరు అన్నావు. నీకు ముందే తెలుసు తాడికొండ నియోజకవర్గంలో రాజధాని పెడతావని ముందే ఆ ప్రదేశం నిర్ణయించి మీ వారికి, వందిమాగధులకు చెప్పి భూములు కొనుగోలు చేయించావు. ఇకపై వారు అక్కడ వ్యవసాయం చేసుకోకూడదనే విధంగా చేశావు.
 
ఇన్‌ సైడ్‌ ట్రేడింగ్‌ చేశావు. దేశంలో ఏ రాజకీయనేతా అలా చేయలేదు. ఇలాంటి ఆలోచనలు లేవు. రూ.వందల కోట్ల ఇన్‌‌సైడ్‌ ట్రేడింగ్‌ చేశావు. నీవు చేసిన మోసాలు నీకు ఉరితాళ్లు కాబోతున్నాయి.
 
ఓటుకు నోటు కేసులో దొరికిపోయావు. దాని గురించి మాట్లాడవు. పిల్లి పాలు తాగుతూ ఎవరికి తెలియదు అనుకుంటుందంట. నీ పనితనం, మోసాలు, అకృత్యాలు, దాడులు, అఘాయిత్యాలు చూడబట్టే నిన్న ప్రజలు తిరస్కరించారు. నీవు, నీ పార్టీ నేతలు చేసిన ఓటుకునోటు, కాల్‌ మని సెక్స్‌ రాకెట్‌ అంశాలు అసెంబ్లీలో చర్చకు వస్తాయని తెలిసి అంబేద్కర్‌ ను అడ్డుపెట్టుకున్నావు. రాజకీయాలు చేశావు. 
 
అంబేద్కర్‌‌ను సైతం మోసం చేశారు చంద్రబాబు. ఎలా అంటే స్మృతివనం అని చెప్పి రూ.వంద కోట్లతో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం, లైబ్రరీ పెడతానని చెప్పి మోసం చేశాడు. రాజధానికి దూరంగా ఎలాట్‌ చేస్తానని చెప్పి మోసానికి పాల్పడ్డావు. నీకు అర్హత ఎక్కడుంది. కరవు పట్టిన తీవ్రవాదిలా అందర్నీ మోసం చేశావు.

రౌండ్‌ టేబుల్‌ పెట్టేముందు మేం వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తర్వాత పెట్టు. నాలుగు బిల్డింగ్‌‌లు కట్టావు. ఎంతమేర దోచుకున్నావు. చదరపు అడుగుకు రూ.ఆరు వేల నుంచి రూ.12 వేలు ఇచ్చావు. ఇది చంద్రబాబు వ్యాపారం. కేవలం రూ.1500 నుంచి రెండు వేలు చదరపు అడుగుకు అవుతుంది. ఇంతగా దుబారా చేసి దోచుకున్నావు. 
 
చెప్పులు, రాళ్లు అనేక మంది వేసి ఉంటారు. 30 మందిని 180 మంది పోలీసులు అదుపుచేయలేకపోయారా అంటాడు.
 నీ మోసాలకు అకృత్యాలకు నీకు అనుకూలంగా ఉండే మీడియా ఎంతగా వత్తాసు పలుకుతున్నా రాష్ట్ర ప్రజలు సంక్షేమం, అభివృద్ది, న్యాయం, ధర్మం వైపు నిలబడుతున్నారు.

వ్యవస్థలో చంద్రబాబు లాంటి ఖూనికోరులు, దగాకోరులు, అసమానతలు పెంచేవారు కావచ్చు అన్నింటికి చంద్రబాబు కారణంగా చెబుతున్నాం. రౌండ్‌ టేబుల్‌‌కు ఎంతమందిని తెచ్చుకున్నా మేం లెవనెత్తిన అంశాల మీద బహిరంగ చర్చకు వచ్చి ఆ తర్వాత రౌండ్‌ టేబుల్‌ నిర్వహించు. మోసకారిలా నీ కార్యక్రమాలు పెడితే రాష్ట్ర ప్రజలు నిన్ను ఛీత్కరించుకుంటారు అంటూ ఎమ్మెల్యే నాగార్జున మండిపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు