వాళ్లు గుడులను కడుతారు.. వీళ్లు గుడులను కూల్చుతారు : వైకాపా ఎంపీ

బుధవారం, 7 అక్టోబరు 2020 (15:14 IST)
ఏపీలోని అధికార వైకాపాను లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోమారు విమర్శలు గుప్పించారు. నరసాపురం లోక్‌సభ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈయన... సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనపై తనదైనశైలిలో సెటైర్లు వేశారు. 
 
ఆయన బుధవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, ఇతాము కేంద్ర మంత్రులం అయిపోయామని వైసీపీ నేతలు ఉత్తుత్తి కబుర్లు చెబుతున్నారని, నవంబరులో కేంద్రమంత్రి వర్గ విస్తరణ వరకు వీళ్లు ఇలాగే చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. వీళ్లు చెప్పేది అన్నీ అబద్ధాలేనని వచ్చే నెలలో తేలిపోతుందని వ్యంగ్యం ప్రదర్శించారు. 
 
ఎవరితోనూ కలిసేది లేదని బీజేపీ స్పష్టంగా చెబుతోందని, కానీ వైసీపీ సొంత ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. దేవాలయాలు నిర్మించే పార్టీ అయిన బీజేపీ... ఆలయాలు కూల్చే వైసీపీతో కలుస్తుందా? అని ప్రశ్నించారు. ఆలయాలపై దాడులు చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోలేని జగన్... ఇప్పుడు బీజేపీతో కలవాలనుకుంటున్నారా? అని నిలదీశారు.
 
అయినా, వీళ్లను ఎన్డీయేలోకి రావాలని బతిమాలుకుంటున్నట్టు, అయితే వీరు ప్రత్యేకహోదా కోసం పట్టుబడుతున్నట్టు కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై సీఎం జగన్‌కు అంత ప్రత్యేక అభిమానం ఉందా? అని ప్రశ్నించారు. 
 
హోదాపై చిత్తశుద్ధి ఉంటే కేంద్ర కేబినెట్ నుంచి బయటికి రావాలని అప్పట్లో టీడీపీని డిమాండ్ చేసింది ఎవరు అంటూ నిలదీశారు. హోదాపై తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ వైసీపీ ఎంపీలంతా రాజీనామాలు చేస్తే అందుకు తాను కూడా సిద్ధమేనని రఘురామకృష్ణరాజు తేల్చిచెప్పారు. అయితే, అంత ధైర్యం వైకాపా ఎంపీలకు ఉందా అంటూ ఆయన నిలదీశారు. 
 
ఇకపోతే, 'ఇంగ్లీష్‌ మీడియంలోనే చదువుకుంటే... తనలా వృద్ధిలోకి రావొచ్చని జగన్‌ అనుకుంటున్నాడేమో? గుజరాతీ మీడియంలో చదివిన మోడీ... ప్రపంచ నాయకుడు అయ్యారన్న విషయం జగన్ గుర్తుపెట్టుకోవాలి. నచ్చిన మీడియంలో చదువుకునే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. అధికారం ఉంది కదా అని రాజ్యాంగాన్ని కూడా మారుస్తామని... వైసీపీ అనుకోవడం పొరపాటు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కూడా జగన్‌ మీడియా తప్పుపడుతోంది. ఇంగ్లీష్‌ అవసరమే, ముందు తెలుగు నేర్పండి. ఆసక్తి ఉన్నవారు ఇంగ్లీష్‌ మీడియంలో చేరి నేర్చుకుంటారు. వారి సహజ హక్కులను హరించకండి' అంటూ వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు